భద్రాద్రి రామయ్య... నీ దర్శనం ఎప్పుడయ్యా..
గత రెండు నెలలుగా కరోనా ప్రభావం వలన ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు.
గత రెండు నెలలుగా కరోనా ప్రభావం వలన ఆలయాల్లోకి భక్తులను అనుమతించడం లేదు. దీంతో భక్తులు ఆ భగవంతున్ని ఎప్పుడు చూస్తామా అని ఆవేదన చెందుతున్నారు. ఆ భగవంతునికి ఎల్లప్పుడు పూజలు నిర్వహించే భక్తుల కోసం ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవలకు అవకాశం కల్పించింది. అయినా వారు అసంతృప్తిలోనే మునిగిపోయారు. దేవున్ని కనులారా చూడకుండా ఎన్ని పూజలు చేస్తే ఏం ఫలితం అని ఆవేదనలో ఉన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనల్లో కొన్నింటికి సడలింపు ఇచ్చిన నేపధ్యంలో ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నదేవాలయాలను ఆదుకునేందుకు ఎండోమెంట్ అధికారులు చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పూర్తి కానుండడంతో భక్తులు ఆలయాల్లోకి జూన్ మాసం నుంచి అనుమతించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఒక వేళ భక్తులను అనుమతిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టి సారించినట్లు కూడా తెలుస్తుంది. పూజలకు అవకాశమిస్తే అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పాటు ఎక్కువ సమయం ఒకేచోట ఉంటారని అప్పుడు భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదని యోచిస్తున్నారు. అందుకే దైవ దర్శన భాగ్యం మాత్రమే కల్పించాలని భావిస్తున్నారు.
ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులను శానిటైజర్ టన్నెల్ ద్వారా ఆలయం లోపలకి వచ్చేలా అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. ఇక దేస్థానం ఆధ్వర్యంలో 27 కాటేజీలు, 140 గదులను ఇప్పుడున్న పరిస్థితుల్లో అద్దెకు ఇవ్వకూడదని ఆలోచిస్తున్నారు.