హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌లో నేడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష
Bandi Sanjay: ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష...
Bandi Sanjay: ఎట్టకేలకు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్‌లో నిరుద్యోగ దీక్షకు అంతా సిద్ధమైంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టాలని బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ నిరుద్యోగ దీక్ష పై ఆంక్షలు విధించారు పోలీసులు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 2 వరకు రాష్ట్రంలో బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం అంటూ ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే దీక్ష కు పోలీసుల అనుమతి కోసం బీజేపీ దరఖాస్తు చేసింది. కానీ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభ లు నిషేధం అని పోలీసులు తెలిపారు.
కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇందిరాపార్క్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ ఆఫీస్‌లో దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించింది. తన దీక్షకు భయపడే కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.'నిరుద్యోగ దీక్ష'కు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను అరెస్టులు చేయడం దుర్మార్గమని బండి సంజయ్ అన్నారు.
తెలంగాణ యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ విడుదల చేశారు. బండి సంజయ్‌ది ఉద్యోగ దీక్ష కాదు.. సిగ్గులేని దీక్ష అంటూ ధ్వజమెత్తారు. బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని విమర్శించారు.