నేడు బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు
* 3 రోజుల పాటు వైభవోపేతంగా వేడుకలు
Hyderabad: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం నేడు జరుగనుంది. 3 రోజుల పాటు జరిగే వేడుకలను వైభవోపేతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం కల్యాణ క్రతువు జరుగనుండగా బుధవారం అమ్మవారి రథోత్సవం నిర్వహించనున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అమ్మవారి కల్యాణ మహోత్సవ వేడుకల సందర్భంగా పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ వేడుకల సందర్భంగా రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గ్రీన్‌ల్యాండ్స్, మాతా టెంపుల్, సత్యం థియేటర్ నుండి ఫతే నగర్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ వద్ద, ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్, అభిలాషా టవర్స్ – బీకేగూడ క్రాస్ రోడ్ – శ్రీరామ్ నగర్ క్రాస్‌రోడ్స్ – సనత్ నగర్ నుంచి ఫతే నగర్ రోడ్డు వైపు మళ్లించనున్నారు. ఫతేనగర్ ఫ్లై ఓవర్ నుంచి బల్కంపేట వైపు వెళ్లే వాహనాలకు అనుమతించరు. కొత్త వంతెన వద్ద కట్టమైసమ్మ దేవాలయం-బేగంపేట వైపు మళ్లించనున్నారు. గ్రీన్‌ల్యాండ్స్ – బకుల్ అపార్ట్‌మెంట్లు – ఫుడ్ వరల్డ్ నుంచి వచ్చే ట్రాఫిక్‌కు బల్కంపేట్ వైపు అనుమతి ఉండదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఫుడ్ వరల్డ్ క్రాస్‌రోడ్‌లో సోనాబాయి టెంపుల్ – సత్యం థియేటర్ – మైత్రీవనం నుంచి ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ వైపు మళ్లించనున్నారు. బేగంపేట, కట్టమైసమ్మ దేవాలయం నుంచి బల్కంపేట్ వైపు వచ్చే వాహనదారులకు అనుమతి ఉండదని, గ్రీన్‌ల్యాండ్స్ – మాతా టెంపుల్ – సత్యం థియేటర్ – ఎస్‌ఆర్ నగర్ టీ జంక్షన్ ఎడమ మలుపులో ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్ వైపు మళ్లించనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌నగర్ టీ జంక్షన్ నుంచి ఫతేనగర్ వరకు అన్ని సబ్ లైన్లు, లింక్‌రోడ్లను మూసివేయనున్నట్లు తెలిపారు.