మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ బాలికను విక్రయించే యత్నం
* తల్లిదండ్రులకు రూ.3 లక్షలు ఆశ చూపిన దళారి * బాలికను రాజస్థాన్ తరలించేందుకు సిద్ధమైన తల్లిదండ్రులు
మహబూబ్ నగర్ జిల్లాలో ఆడపిల్లలపై వివక్ష ఇంకా కొనసాగుతునే ఉంది. పెళ్లి చేసే స్థోమత లేక ఓ గిరిజన కుటుంబం మైనర్ బాలికను విక్రయూనికి పెట్టిన అమానుష ఘటన వెలుగు చూసింది. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్ పేట మండలం హజిలాపూర్ గ్రామాల పరిధిలోని నాలోనికుంట తండాకు చెందిన వాళ్లమ్మ, రవి నాయకుల దంపతులకు నలుగురు సంతానం. హైదరాబాద్ లో కూలి పనులు చేసుకుంటూ కుటుంబానికి పోషించుకుంటున్నారు. వీరి రెండో కుమార్తెకు 17 ఏళ్లు వచ్చినా పెళ్లి చేయలేకపోతున్నాం అన్న వీరి బాధను గమనించిన షాద్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ఆ మైనర్ బాలికకు రాజస్థాన్ కు చెందిన ఓ కుటుంబానికి విక్రయిస్తే 3 లక్షలు ఇస్తారని ఆశ చూపాడు. దరిద్ర్యాన్ని అనుభవిస్తున్న ఆ దంపతులు తమ కుమార్తెను అమ్మకానికి పెట్టారు.
రాజస్థానీయులకు బాలికను అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 5వ తేదీన ఉదయం నవాబ్ పేట నుంచి అమ్మాయిని తీసుకొని హైదరాబాద్ కు బయల్దేరారు. ఇంతలో దుబాయ్ లో ఉన్న అమ్మాయి బాబాయ్ కి విషయం తెలియడంతో వెంటనే నవాబ్ పేట్ పోలీసులకు సంప్రదించాడు. రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తరలింపును అడ్డుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు బాలికను మహబూబ్ నగర్ లోని స్టేట్ హోం కు తరలించారు.