Toll Charges: సామాన్యుడిపై మరో భారం...
Toll Charges: *వార్షిక సవరణల్లో భాగంగా టోల్ చార్జీలు పెంచిన GMR *నిన్న అర్ధరాత్రి నుంచి పెరిగిన టోల్ చార్జీలు అమలు
Toll Charges: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుతో సతమతమవుతున్న వాహనదారుడికి మరో భారం పడింది. వార్షిక సవరణల్లో భాగంగా టోల్ చార్జీలు పెరిగాయి. కార్లు, జీపులు వంటి వాహనాలపై 5 నుంచి 8 శాతం, లైట్ కమర్షియల్ వాహనాలకు 10 నుంచి 15 శాతం, బస్సులు, ట్రక్కులకు 10 నుంచి 15 శాతం మేర చార్జీలను పెంచింది టోల్ ఫీజుల కాంట్రాక్ట్ సంస్థ GMR.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆందోల్ మైసమ్మ దేవాలయం నుంచి ఏపీలోని కృష్ణాజిల్లా చిల్లకల్లు వరకు 181.5 కిలోమీటర్ల మేర రెండు లేన్లుగా ఉన్న 65 వ నెంబర్ జాతీయ రహదారిని సుమారు రెండు వేల కోట్లతో పదేళ్ల క్రితం BOT పద్దతిలో GMR సంస్ధ నాలుగు లేన్లుగా విస్తరించారు. ఈ విస్తరణ పనులకు అయిన వ్యయాన్ని రాబట్టుకునేందుకు నేషనల్ హైవేపై.. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద, కేతపల్లి మండలం కొర్లపాడు వద్ద.. అలాగే.. ఏపీలో కృష్ణాజిల్లా చిల్లకల్లు వద్ద మొత్తం మూడు టోల్ ప్లాజాలను GMR ఏర్పాటు చేసింది.
ఈ మూడు టోల్ ప్లాజాల ద్వారా 2012 నుంచి GMR టోల్ ఫీజ్ వసూళ్లను ప్రారంభించింది. NHAI నిబంధనల మేరకు.. వార్షిక సవరణల పేరిట ఏడాదికి ఒకసారి వాహనాల నుంచి వసూలు చేస్తున్న టోల్‌ఫీజును పెంచుకునే వెసులుబాటును GMR సంస్ధకు కల్పించింది. దీంతో మరోమారు టోల్ ఛార్జీలు పెరిగాయి. నిన్న అర్ధరాత్రి నుంచే పెరిగిన కొత్త టోల్ చార్జీలు అమల్లోకి వచ్చాయి.
ఇదిలా ఉంటే కొన్నిచోట్ల సర్వీస్ రోడ్లు, మౌలిక వసతులు పూర్తి కాకుండానే.. ప్రయాణికులపై టోల్ భారం మోపడం కరెక్ట్ కాదని స్థానికులు, వాహనదారులు మండిపడుతున్నారు. అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాతే టోల్ చార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే నిత్యవసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని కోరుతున్నారు.