Amit Shah: ఈనెల 28న తెలంగాణకు అమిత్ షా
Amit Shah: బీజేపీ 'మిషన్ తెలంగాణ'
Amit Shah: తెలంగాణలో అధికారంలో రావాలని బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది. అందుకోసం పార్టీ జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక రాష్ట్రంలో అగ్ర నాయకుల పర్యటనలు వరుసగా ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 19న ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు రానుండగా ఇదే నెలలో అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా వస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కమలనాథులు కార్యచరణకు పదును పెట్టారు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పూర్తి పట్టు సాధించిన బీజేపీ ఇప్పుడు దక్షిణ భారత దేశంపై దృష్టి సారించింది. అందులో ప్రధానంగా తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠాన పెద్దలు తరచూ తెలంగాణకు వస్తూ అటు నాయకులకు దిశానిర్దేశం చేస్తూనే ఇటు శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణకు వస్తున్నారు. మరోవైపు జనవరి 19న హైదరాబాద్‌కు ప్రధాని మోడీ వచ్చి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించి.. వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఆ వెను వెంటనే హోం మంత్రి అమిత్ షా కూడా రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు సంఘ్ నేతలతోనూ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతేడాది ఐదు సార్లు రాష్ట్రానికి వచ్చారు అమిత్ షా. వరుసగా బీజేపీకి సంబంధించిన ముఖ్యమైన సమావేశాల్లో పాల్గొంటున్నారు. నేతలకు టార్గెట్లను ఫిక్స్ చేస్తన్నారు. ఎవరేం చేయాలనే విషయంలో నూటికి నూరు శాతం క్లారిటీ ఇచ్చి వెళ్తున్నారు.
ఇక అమిత్ షా, జేపీ నడ్డా ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ నాయకులు కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. టార్గెట్ 90 పేరుతో వచ్చే ఎన్నికల్లో 90 సీట్లలో గెలవడమే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటు బిఆర్ఎస్ పై పోరుబాట పెట్టారు. ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో మరింతగా వర్క్ స్పీడ్ పెంచింది కమలం ధళం. అందలో భాగంగా బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్‌లు కేసీఆర్ సర్కార్‌ను ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు. పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
అయితే ఫిబ్రవరి 15 నుంచి అసెంబ్లీ స్థాయి సమావేశాలు, మార్చి 5 నుంచి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని ఎంపీ లక్ష్మణ్ ఇటీవలే ప్రకటించారు. ఏప్రిల్‌లో ప్రభుత్వంపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. అంతకు ముందు నుంచే సంస్థాగతంగా బలోపేతం అయ్యేందుకు బీజేపీ సైలెంట్‌గా కార్యచరణ అమలు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో జాతీయ నేతలు తెలంగాణలో పదేపదే పర్యటిస్తుండటం వచ్చే 8 నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేయటం చర్చనీయాంశంగా మారింది.