Amid Coronavirus pandemic: కరోనా భయంతో ప్రాణాలు కోల్పోతున్న జనం

Update: 2020-07-29 08:05 GMT

Amid Coronavirus pandemic: కరోనా భయం ప్రాణాలను బలితీసుకుంటుంది. సమాజంలో ఎదురవుతోన్న వివక్షతో కొందరు కరోనా సోకితే ఏమవుతుందో అంటూ మరికొందరు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోనూ ఇలాంటి ఘటనలు ఆందోలన రేకెత్తిస్తున్నాయి. కరోనా భయంతో సంభవిస్తున్న మరణాలు ఆవేదన కలిగిస్తున్నాయి.

భయం.. ఎంతటి మనిషినైనా దిగజారుస్తోంది. మానసికంగా కుంగదీసి ప్రాణాలు తీసుకునేలా చేస్తుంది. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలో ఇలాంటి పరిస్దితులే కనిపిస్తున్నాయి. కరోనా వస్తుందేమో ఇప్పటికే కరోనా సోకిందేమో అనే భయాలు జిల్లాలో చాలా మందిని వెంటాడుతున్నాయి. ఇలాంటి భయాలతో కొందరు బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. కరీంనగర్ పట్టణంలోని ఓ అపార్ట్మెంట్ లో ఇటీవల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుతో ఇబ్బంది పెడుతున్న అపార్ట్‌మెంట్ వాసుల్ని క్షమాపణ అడుగుతూ ఓ లేఖ రాసి మరీ చనిపోయాడు. అతని ఆత్మహత్యకి కారణం భయం. కరోనా లక్షణాలున్నాయి టెస్ట్ చేసుకోవాలన్న వైద్యుడి సలహా అతన్ని భయానికి గురి చేసింది.

ఇక కరీంనగర్ లో వావిలాల పల్లి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే కరోనా వచ్చిందన్న భయంతో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇక ఆ పక్క ప్రాంతంలోనే మరో పెద్దాయన ఎక్కడ కరో్నా వస్తుందో అని మూడు నాలుగు రోజులు భయాందోళనకు గురయ్యాడు. శాంపిల్స్ ఇచ్చి ఇంటికి వచ్చాక హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. ఇలా వ్యాధితో కంటే భయంతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. దీనికి సమాజంలో ఎదురవుతోన్న వివక్ష కూడా కారణమవుతోంది. కరోనా సోకిన వ్యక్తిని అతని కుటుంబాన్ని దూరం పెడుతున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. దీంతో కరోనా వస్తే తన కుటుంబం ఏమవతుందో అన్న భయం కొందరిని వెంటాడుతుంది. నిజానికి కరోనా ప్రాణాంతకమైన వ్యాధి కాదంటూ ఎంతో మంది డాక్టర్లు, వైద్య నిపుణులు చెబుతున్నారు. అయినా మానసిక ధైర్యం కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు కరీంనగర్ జిల్లా వాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Tags:    

Similar News