Caste Census: నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే.. ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి..
Caste Census: నేటి నుంచి తెలంగాణవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు.
Caste Census: నేటి నుంచి తెలంగాణవ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. మొత్తం 75 ప్రశ్నలతో ఉన్న సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబ యాజమాని, సభ్యుల వివరాలు పొందుపరచనున్నారు. మొత్తం 28 లక్షల 26వేల 682 గృహాలపై సర్వే సేకరించనున్నారు. నేటి నుండి ఈనెల 30 వరకు చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేను.. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు కంటోన్మెంట్‌లోనూ నిర్వహించనున్నారు. కంటోన్మెంట్ పరిధిలో 50వేల ఇళ్లలోను.. జీహెచ్ఎంసీ పరిధిలో 27లక్షల 76వేల 682 గృహాలపై సర్వే చేపట్టనున్నారు. ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా గుర్తించారు.
56 ప్రధాన, 19 అనుబంధ ప్రశ్నలతో కలిపి మొత్తం 75 ప్రశ్నలతో సమగ్ర సమాచారాన్ని తీసుకుంటారు. పార్ట్-1, పార్ట్-2 కింద ఎనిమిది పేజీల్లో ఈ సమాచారాన్ని పూరిస్తారు. మొదటి భాగం (పార్ట్-1)లో కుటుంబ యజమాని, సభ్యుల వ్యక్తిగత వివరాలు తెలపాల్సి ఉంటుంది. పార్ట్-1లో మొత్తం 60 ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో ఆస్తులు, అప్పులు, ఇంటికి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి.
ఈ సర్వేలో ప్రధాన ప్రశ్నలతోపాటు 19 ఉప ప్రశ్నలకు జవాబులు ఇవ్వాల్సి ఉంటుంది. సమగ్ర సర్వేకి వచ్చే సిబ్బంది మిమ్మల్నిగానీ, మీ కుటుంబీకులను గానీ ఫోటోలు తీయరు. అడగరు. ఎలాంటి ధృవీకరణ పత్రాలు తీసుకోరు. కుటుంబంలో అందరూ ఉండాల్సిన అవసరంలేదు. కుటుంబ యజమాని అందుబాటులో ఉండి వివరాలు చెబితే సరిపోతుంది. ముందుగా జిల్లా, మండలం, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, ఇంటి నంబర్ వివరాలను ఎన్యుమరేటర్లు నమోదు చేస్తారు. కులం.. యజమాని.. కుటుంబ సబ్యులు.. విద్యార్హత, వృత్తి, వైవాహికస్థితి, వార్షికాదాయం, ఐదేళ్లలో తీసుకున్న రుణాలు, ఇంటి విస్తీర్ణం, సదుపాయాల లాంటి వివరాలను, భూమి వివరాలను సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా సేకరిస్తారు.