Hyderabad: స్కూల్‌కి వెళ్లిన 1వ తరగతి బాలుడు శవమై తిరిగొచ్చాడు.. స్కూల్లో అసలేం జరిగింది?
Hyderabad: స్కూల్‌కు వెళ్లిన ఆరేళ్ల బాలుడు శవమై తిరిగొచ్చిన ఘటన హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్ నగర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది.
Six year old boy died after govt high school gate falled on him in Hyderabad: స్కూల్‌కు వెళ్లిన ఆరేళ్ల బాలుడు శవమై తిరిగొచ్చిన ఘటన హైదరాబాద్ (Hyderabad) శివార్లలోని హయత్ నగర్‌లో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో అజయ్ అనే బాలుడు 1వ తరగతి చదువుతున్నాడు. దీపావళి సెలవుల తరువాత సోమవారమే స్కూల్స్ తెరిచారు. ఎప్పటిలాగే అజయ్ తల్లిదండ్రులు పొద్దున్నే ఆ బాలుడిని రెడీ చేసి స్కూల్‌కు పంపించారు.
అప్పుడు సమయం సాయంత్రం 3 గంటల 45 నిమిషాలు అవుతోంది. బాలుడు ఇంకొద్ది సేపట్లో ఇంటికి తిరిగి రావాల్సి ఉంది. ఆ తల్లిదండ్రులు బాలుడి కోసం ఎదురుచూస్తున్నారు. అంతలోనే స్కూల్ నుండి ఓ బ్యాడ్ న్యూస్ వచ్చింది. "మీ బాబు అజయ్‌పై స్కూల్ గేట్ విరిగిపడింది. అజయ్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నాడు. స్కూల్ సిబ్బంది బాబుని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. అక్కడికి రండి" అని చెప్పారు.
అప్పటికే అజయ్ కోసం ఎదురుచూస్తోన్న ఆ తల్లిదండ్రులకు ఆ వార్త షాక్ కొట్టినట్లనిపించింది. అసలేం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. ఆలోచించేంత సమయం కూడా లేదు. వెంటనే స్కూల్ సిబ్బంది చెప్పినట్లుగా ఆస్పత్రికి పరుగులు తీశారు. మరోవైపు బాలుడిని స్కూల్ సిబ్బంది తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. అజయ్‌ను పరీక్షించిన డాక్టర్లు, అప్పటికే అతడు చనిపోయినట్లు ధృవీకరించారు.
స్కూల్ సిబ్బంది ఏం చెబుతున్నారు?
స్కూల్ ముగిసే ముందు పిల్లలంతా బయట ఆడుకుంటున్నారు. ఆ క్రమంలోనే కొంతమంది పిల్లలు స్కూల్ మెయిన్ గేటు ఎక్కి ఊగుతున్నారు. వారు దిగివెళ్లిపోయిన తరువాత అజయ్ కూడా అదే గేటు పట్టుకుని వేళ్లాడాడు. కానీ అప్పటికే తుప్పుపట్టిన ఆ గేటు విరిగి అజయ్‌పై పడింది. పక్కనే ఉన్న మరో బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కానీ అజయ్‌ను మాత్రం ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయిందని స్కూల్ సిబ్బంది చెబుతున్నారు.
అజయ్ తల్లిదండ్రులకు, జనానికి అర్థం కాని ప్రశ్న
ఏదేమైనా బుడిబుడి అడుగులేసుకుంటూ స్కూల్‌కి వెళ్లిన బాలుడు ఇక లేడనే చేదునిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో తప్పెవరిది ? తెలిసీ తెలియని వయస్సులో గేటు పట్టుకుని వేళ్లాడిన బాలుడిదా? ఆ తప్పు చేయకుండా ఆపలేకపోయిన అక్కడి సిబ్బందిదా? లేక తుప్పుపట్టిన గేటు ప్రమాదకరం అని తెలిసి కూడా దానిని అలాగే వదిలేసిన స్కూల్ హెడ్ మాస్టర్‌దా ? ఇది అజయ్ తల్లిదండ్రులనే కాదు.. తమ ఇంట్లో ఆ వయస్సు పిల్లలున్న ప్రతీ ఒక్కరినీ వేధిస్తోన్న ప్రశ్న.