జీహెచ్‌ఎంసీ కొత్త పాలకవర్గం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. కాసేపట్లో అన్ని పార్టీల కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కార్యాలయంలో కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో పాటు మేయర్ పీఠం దక్కించుకునేది ఎవరనే సందిగ్ధతకు కూడా మరికొద్ది గంటల్లో తెరపడనుంది.
ప్రమాణస్వీకార కార్యక్రమానికి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్ లో పార్టీలు, అభ్యర్థుల వారీగా సీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రతి లైన్ లో సహాయకారిగా ఉండేందుకు రో-అధికారులను నియమించారు.
ప్రతి సభ్యుడు తమ ఫోటో కలిగిన గుర్తింపు కార్డు, జీహెచ్ఎంసీ పంపిన లేఖ, ఆర్వో ఇచ్చిన విన్నింగ్ సర్టిఫికెట్‌ను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలలోపు కార్పొరేటర్లంతా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని తెలిపారు. 11 గంటలకు 149 మంది కొత్త కార్పొరేటర్లు ప్రమాణం చేయనున్నారు. నాలుగు భాషల్లో ప్రమాణస్వీకార పత్రం ఉండగా.. ఏ భాషలో అయినా ప్రమాణ స్వీకారం చేసే అవకాశమిచ్చారు.
ప్రమాణ స్వీకారం అనంతరం 12 గంటల 30 నిమిషాలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. చేతులు ఎత్తే పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తారు. జీహెచ్ఎంసీలో 149 నూతన కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు 44 మంది కలిపి మొత్తం 193 మంది సభ్యులున్నారు. 97 మంది సభ్యులు హాజరై కోరం ఉంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. లేదంటే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక శుక్రవారానికి వాయిదా పడుతుంది. ఆ రోజు కూడా ఎన్నికలు జరగకుంటే ఎస్ఈసీ మరో తేదీని ప్రకటించనుంది.