Hyderabad: హైదరాబాద్‌లో నిండుకుండలుగా చెరువులు
Hyderabad: గజగజ వణికిపోతున్న ముంపు ప్రాంతాలవారు
Hyderabad: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు ముంపు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. గతేడాది కన్నీళ్లింకా ఇంకనే లేదు.. మళ్లీ ముంచేందుకు వరద సిద్ధమవుతోంది. నగరంలోని చేరువులన్ని నిండు కుండను తలపిస్తున్నాయి. నగరంలో ప్రమాద ఘంటికలు మోగిస్తున్న చెరువులపై HMTV గ్రౌండ్ రిపోర్ట్
నగరంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరంలో లక్షల మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 185, హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ పరిధిలో 3 వేల 132 చెరువులు ఉన్నాయి. వీటిలో చాలా చెరువులు వర్షాలతో నిండు కుండను తలపిస్తున్నాయి. నల్లగండ్ల చెరువు పూర్తిగా నిండిపోయి వరద ప్రవాహం పెరుగుతోంది. ఇక జల్‌పల్లి బురాన్‌ఖాన్ చెరువు పూర్తిగా నిండిపోవడంతో బాలాపూర్ వెళ్లే రహదారులన్నీ జలమయమయ్యాయి. ఏడు కాలనీల్లో 450 ఇళ్లు నీట మునిగాయి.
రాజేంద్రనగర్ గగన్‌పహాడ్ సమీపంలోని అప్పాచెరువు అలుగు పారుతోంది. బెంగళూరు జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గోపి చెరువు అదే పరిస్థితిలో ఉంది. గత ఏడాది చెరువు కట్ట తెగి ఇళ్లలోకి నీరు చేరి ఇబ్బందులు పడ్డామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక పనులు చేపట్టడంతో వరద ప్రవాహం పెరుగుతుందని భయాందోళణకు గురవుతున్నారు. ఇప్పటికే చెరువు నిండి వరద నీరు కాలనీ రోడ్లను ముంచెత్తుతోందని అంటున్నారు స్థానికులు.
నగరంలోని చెరువులు ప్రమాదకరంగా మారుతుండటంతో అటు అధికారులు సైతం అప్రమత్తంగానే ఉన్నారు. హయత్‌నగర్‌లోని బాతుల చెరువు, కుమ్మరి కుంటలో భారీగా వరద నీరు చేరింది. ఇప్పటికే అంబేడ్కర్ బస్తీ సహా నాలుగు కాలనీల్లో వరద నీరు ప్రవహిస్తోంది. మల్కాజిగిరిలోని బండచెరువు నిండి సమీపంలోని షిరిడీ కాలనీ నీట మునిగింది. వంద ఇళ్లలో వరద నీరు చేరింది.
జీడిమెట్ల సమీపంలోని ఫాక్స్ సాగర్‌లోకి భారీగా వరద చేరింది. ఉమామహేశ్వర కాలనీలో 100కుపైగా ఇళ్లు మునిగాయి. బండ్లగూడ చెరువులోకి భారీగా వర్షపు నీరు చేరుతోంది. సరూర్‌నగర్ చెరువు నిండితే సమీపంలోని 12 కాలనీలు మునిగే అవకాశం ఉంది. రామంతాపూర్‌లోని పెద్దచెరువు నుంచి నీటిని మోటార్లు పెట్టి చిన్న చెరువులోకి తోడేస్తున్నారు.