Agneepath Scheme Protests: రణరంగంగా మారిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
Agneepath Scheme Protests: హింసాత్మకంగా మారిన రైల్వే స్టేషన్ లోని ఆందోళన
Agneepath Scheme Protests Updates: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రణరంగంగా మారింది. అగ్నిపథ్ కు నిరసనగా ఆందోళన చేపట్టిన ఆర్మీ అభ్యర్థులు రైల్వేస్టేషన్ లో బీభత్సం సృష్టించారు. ఒక్కసారిగా దూసుకొచ్చిన వేల మంది ఆందోళనకారులతో రైల్వేస్టేషన్ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రైళ్లకు నిప్పుపెట్టారు. ప్లాట్ ఫారమ్ పై ఫార్సిల్ సామాన్లు వేసి నిప్పంటించారు. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణీకులు ప్రాణభయంతో రైళ్లు దిగి పరుగులు తీశారు.
పార్సిల్ కార్యాలయం, ప్లాట్ ఫారమ్ పై ఉన్న స్టాల్స్, ఫర్నీచర్ ను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రైల్వేస్టేషన్ లోని పార్సిల్ ఆఫీసులో ఉన్న బైకులు, ఇతర సామాన్లకు నిప్పుపెట్టారు. రైల్వేట్రాక్, ప్లాట్ ఫామ్ తో పాటు రైల్వేస్టేషన్ లో సుమారు 3 గంటల పాటు ఉద్రిక్తత కొనసాగింది. ఆందోళనకారుల దాడిలో మూడు రైళ్లు ధ్వంసం అయ్యాయి. గూడ్స్ రైలుతో పాటు అజంతా ఎక్స్ ప్రెస్ లోని రెండు బోగీలు దగ్ధం అయ్యాయి. ఈ ఆందోళనలో సుమారు 50 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అగ్నిపథ్ రద్దు చేసి ఆర్మీ పరీక్షలు యధాతథంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో యువకులు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కు తరలివచ్చారు. మొదట రైల్వేస్టేషన్ బయట ఆగిఉన్న ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అనంతరం, అగ్నిపథ్ రద్దు చేయాలంటూ స్టేషన్ ఆవరణలో రైలు ఇంజన్ ఎదుట బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే పరిస్థితి అదుపు తప్పింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న యువకుల్లో కొందరు రైల్వే ఆస్తులపై దాడులకు దిగారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇదంత ఉదయం 9 గంటల సమయంలో మొదలైంది. యువకుల ఆందోళనను ఆదుపు చేసేంత రైల్వే బలగాలు అందుబాటులో లేకపోవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన ఆందోళన.. బీభత్సంగా మారింది. నిమిషాల వ్యవధిలోనే ఒకటో నంబరు నుంచి మూడో నంబరు ప్లాట్ ఫామ్ వరకు రణరంగంగా మారింది.
ఓవైపు ఆవేశంలో ఉన్న యువకులు.. మరోవైపు వారిని కంట్రోల్ చేసే పరిస్థితి లేకపోవడంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ యుద్ధక్షేత్రంగా మారిపోయింది. పార్సిల్ కార్యాలయంలోకి దూసుకెళ్లిన యువకులు అక్కడ దొరికి వస్తువును బయటకు తీసుకొచ్చి రైల్వే పట్టాలపై వేసి తగులబెట్టారు. ఇందులో బైక్ లకు త్వరగా దగ్ధమయ్యే స్వభావం ఉండటంతో.. క్షణాల్లోనే రైల్వేస్టేషన్ ఆవరణలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్టేషన్ లోని ప్రయాణీకులకు ఏం జరుగుతుందో తెలియిన అయోమయం నెలకొంది. ప్రాణభయంతో స్టేషన్ నుంచి ప్రయాణీకులు పరుగులు తీశారు.