Cabinet Meeting: ఇవాళ మరోసారి తెలంగాణ కేబినెట్ భేటీ
Cabinet Meeting: కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఖాళీల భర్తీకి చేపట్టాల్సిన చర్యలు
Cabinet Meeting: ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం సుధీర్ఘంగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీ అంశంపై చర్చించారు. ఆయా శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను ఆర్థికశాఖ కేబినెట్‌కు నివేదించింది. కొత్త జోనల్ వ్యవస్థకు ఆమోదం లభించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కేడర్ వర్గీకరణ, ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల, అధికారుల కేటాయింపులు చేపట్టాలన్న టీఎన్జీఓ , టీజీఓ విజ్జప్తిపై మంత్రివర్గంలో చర్చించారు. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపు వెంటనే చేపట్టాలని నిర్ణయించిన కేబినెట్ ఆ తర్వాత ఖాళీల గుర్తింపు, భర్తీ ప్రక్రియ సత్వరమే జరగాలని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను పక్షం రోజుల్లో పూర్తి చేయలని అన్నట్లు సమాచారం.
ఉద్యోగ నియామకాల ప్రక్రియలో సంస్కరణలు అవసరమని కేసీఆర్ తెలిపారు. ఒకే సంస్థ మీద భారం మోపడం సరికాదన్నారు. వస్తున్నాయి. పబ్లిక్ సర్వీసు కమిషన్‌తో పాటు పోలీసు, వైద్య, గురుకులాలు, నీటిపారుదల శాఖ నియామక సంస్థలతో పాటు జిల్లా స్థాయి ఎంపిక కమిటీలకు సైతం అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఉద్యోగాల భర్తీ దీర్ఘకాలం సాగడం వల్ల నిరుద్యోగులు నష్టపోతున్నారని వెల్లడించారు. ఫలితాల కోసం ఎదురుచూస్తూ విలువైన కాలాన్ని కోల్పోతున్నారని చెప్పారు, దీనిని నివారించేందుకు యూపీఎస్సీ తరహాలో వార్షిక క్యాలెండర్ విధానాన్ని అమల్లోకి తెస్తామన్నారు.
అన్ని రకాల పోస్టులలో ఖాళీలను గుర్తించిన తర్వాత ప్రతి సంవత్సరం నియామకాల కోసం వార్షిక క్యాలెండర్‌ను తయారు చేయాలని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకొంది. వార్షిక నియామక క్యాలెండర్ రూపొందించి అందుకు అనుగుణంగా విధిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించింది. ఖాళీల గుర్తింపుతో పాటు వాటి భర్తీకి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు కేబినెట్ ఇవాళ కూడా సమావేశం కానుంది. మధ్యాహ్నం రెండు గంటలకు జరగనున్న సమావేశానికి పూర్తి వివరాలతో హాజరు కావాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి పూనుకోవటంతో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా నియామకాల ప్రక్రియ చేపట్టాలని కోరారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. 50 వేల ఉద్యోగాల్లో ఎక్కవగా పోలీసు శాఖ చెందిన ఉద్యోగాలు ఉన్నట్లు తెలుస్తోంది.