Nagarjuna Sagar: నిర్వహణ లోపంతోనే ప్రమాదాలు.. మరమ్మతులను సరిదిద్దడంలో విఫలం

Nagarjuna Sagar: శ్రీశైలం జల విద్యుత్పాదన కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పరోక్షంగా పలు ప్రశ్నలను సంధిస్తోంది.

Update: 2020-08-23 03:16 GMT

Nagarjuna Sagar: శ్రీశైలం జల విద్యుత్పాదన కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదం పరోక్షంగా పలు ప్రశ్నలను సంధిస్తోంది. గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్ధకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంచనా వేస్తున్నారు. నిత్యం విద్యుత్ సరఫరాతో ఉండే ఇక్కడ మరమ్మతులకు తావులేకుండా చేయడం వల్లే ప్రమాదాలను నివారించవచ్చని తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలుస్తోంది.

శ్రీశైలం ఎడమ భూగర్భ జల విద్యుదుత్పాదన కేంద్రంలో గురువారం రాత్రి విద్యుత్‌ ప్రమాదం జరిగి పలువురు ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి కారణంఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, తప్పు జరిగిన చోట పైరవీలకు తావిచ్చి వారిపై చర్యలు తీసుకోకపోవడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ప్రధానమైన విద్యుదుత్పాదన కేంద్రాల్లో నాగార్జునసాగర్‌ ఒకటి. ఇందులో గతంలో పలు ప్రమాదాలు జరిగాయి.

సాగర్‌లో జరిగిన ప్రమాదాలు..

నాగార్జునసాగర్‌లోని ప్రధాన విద్యుదుత్పాదన కేంద్రంలో.. సాగర్‌ జలాశయం నుంచి విద్యుదుత్పాదన చేయడంతో పాటు ఆ టర్బైన్‌లనే పంపులుగా వాడి నీటిని తిరిగి జలాశయంలోకి ఎత్తిపోస్తుంటారు. ఈ క్రమంలో టర్బైన్‌లోకి నీరు రాకుండా పెన్‌స్టాక్‌ ఉంటుంది. దానికి గేట్‌ ఉంటుంది. ఆ పెన్‌స్టాక్‌ గేటును తెరవకుండానే ఇంజనీర్లు నిర్లక్ష్యంగా18 ఫిబ్రవరి 2019న 7వ యూనిట్‌ టర్బైన్‌పై లోడ్‌ వేయడంతో.. టెయిల్‌పాండ్‌లో నుంచి తోడిన నీరంతా 50 మీటర్ల ఎత్తున ఉన్న ఎయిర్‌మెంట్‌వాల్‌లో నుంచి బయటకు వచ్చి స్విచ్‌ యాడ్‌ నిండింది. ఆ నీరు పడగానే కండక్టు, గవర్నర్లు తగలబడి మూడు ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయాయి. దీంతో రెండు ఫీడర్లలో నుంచి వెళ్లే విద్యుత్‌ నిలిచిపోయింది. అలాగే 8వ యూనిట్‌లో షార్ట్‌సర్క్యూట్‌తో ఎలక్ట్రిక్‌ ప్యానెళ్లు తగలబడి నేటికి మరమ్మతులకు నోచుకోలేదు.

మూడో యూనిట్‌ పరిస్థితి అలాగే ఉంది. గతంలో పాడైపోయి సర్వీసింగ్‌ పనులు జరుగుతున్న మూడో యూనిట్‌ నడవడం లేదు. వీటి మరమ్మతులకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. గతంలో ఎడమ కాల్వపై ఉన్న విద్యుదుత్పాదన కేంద్రంలో ఒకటో టర్బైన్‌ పెన్‌స్టాక్‌ పాడైపోయి ఓపెన్‌ వెల్‌ నుంచి టర్బైన్‌లోకి నీరు చొచ్చుకు వచ్చి రెండు యూనిట్లు మునిగి పోయాయి. కోట్ల రూపాయలతో మరమ్మతులు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని పలువురు విమర్శిస్తున్నారు. 

Tags:    

Similar News