Siva Balakrishna: బాలకృష్ణ బినామీలకు నోటీసులు జారీ చేసిన ఏసీబీ
Siva Balakrishna: విచారణకు రావాలని భరత్, సత్యనారాయణ, భరణిలకు నోటీసులు
Siva Balakrishna: అక్రమాస్తులు కూడబెట్టిన హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు దర్యాప్తులో ఏసీబీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీలు భరత్, సత్యనారాయణ, భరణిలు విచారణకు హాజరుకావాలని ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఏసీబీ కార్యాలయంలో ముగ్గురు బినామీలను ఇవాళ విచారించనున్నారు. బినామీల పేర్లపై ఉన్న డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ.. యాదాద్రి జిల్లాలో 57 ఎకరాల భూమిని శివబాలకృష్ణ బినామీల పేరుతో కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
బాలకృష్ణ బినామీ భూములపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ యాదాద్రి జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు ఏసీబీ అధికారులు. వలిగొండలో హరి ప్రసాద్ అనే వ్యక్తి పేరిట ఎనిమిదెకరాలు, రఘుదేవి పేరు మీద 11 ఎకరాలు, చిత్తాపూర్‌లో ఎస్.పద్మావతి పేరు మీద 3.3 ఎకరాలు, చిన్నరావుపల్లిలో శివఅరుణ పేరిట 20 గుంటలు బినామీల ఆస్తులను గుర్తించారు. మరో వైపు శివబాలకృష్ణ సోదరుడు నవీన్ పేరు మీద మోత్కూర్‌లో 26 ఎకరాలు, రెడ్డరేపాకలో ఎనిమిదెకరాలు భూమి రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. అయితే ఈ భూములన్నిటినీ 2021 నుంచి 2023 మధ్య కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది.