Nizamabad: వైన్‌షాపుల కోసం దరఖాస్తుల వెల్లువ
Nizamabad: కామారెడ్డి జిల్లాలో 352 దరఖాస్తులు, నిజామాబాద్ జిల్లాలో 120
Nizamabad: మద్యం దుకాణాలకు దరఖాస్తులు వెల్లువెతున్నాయి. రాబోయే ఏడాదిలో ఎన్నికల సందడి ఉండటంతో తమ అదృష్టాన్ని దరఖాస్తు దారులు పరీక్షించుకోబోతున్నారు. యువకులు, మహిళలు, నేతలు, కాంట్రాక్టర్లు అనే తేడా లేకుండా వైన్స్ షాప్ టెండర్ల కోసం క్యూలు కడుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో టెండర్లు అధిక సంఖ్యలో దాఖలవుతున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 352 దరఖాస్తులు రాగా, నిజామాబాద్ జిల్లాలో 120 వచ్చాయి. ఈ నెల 18 వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండగా, అదృష్టం పరీక్షించుకునేందుకు చాలా మంది సిద్ధమవుతున్నారు. దీంతో ఈసారి భారీగానే టెండర్లు వచ్చే అవకాశమున్నట్లు కనపడుతుంది.
2023-25 సంవత్సరానికి నూతన మద్యం పాలసీ ద్వారా మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఆహ్వానించగా విశేష స్పందన లభిస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తులు రికార్డు స్థాయిలో వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో 102 వైన్ షాప్స్ కు ఇప్పటి వరకు 120 దరఖాస్తులు రాగా, 500కు పైగా దరఖాస్తులు తీసుకెళ్లారు. నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 27, ఆర్మూర్ సర్కిల్ పరిధిలో 31 బోధన్ పరిధిలో 31, భీమ్‌గల్ పరిధిలో 11, మోర్తాడ్ పరిధిలో 20దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 120 దరఖాస్తులు రాగా, శుక్రవారం ఒకే రోజు 66 అప్లికేషన్లు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది.
కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాలకు గాను వ్యాప్తంగా ఇప్పటి వరకు 352కు పైగా దరఖాస్తులు వచ్చాయి. గురువారం ఒక్కరోజే 105 దరఖాస్తులు రావడం గమనార్హం. ఈనెల 18 వరకు దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 49 వైన్స్ షాప్స్ కు దరఖాస్తుల ప్రక్రియ చేపట్టారు. కామారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 352 దరఖాస్తులు రాగా, 700 దరఖాస్తు ఫారాలు తీసుకెళ్లారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి, దోమకొండ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద పరిధిలో దరఖాస్తులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఒక్క కామారెడ్డి జిల్లాలో 1000 అప్లికేషన్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ పి.దశరథం పర్యవేక్షణలో వైన్స్ టెండర్ల ప్రక్రియ చేపట్టారు. నిజామాబాద్ జిల్లాలో సూపరింటెండెంట్ కె.మల్లారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల ఈఎస్ కార్యాలయంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్, మోర్తాడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఉన్న 102 మద్యం షాపులకు టెండర్లు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని వివిధ రంగాల్లో ఉన్న వ్యాపారులు ఈనెల 18 వరకు మద్యం షాపుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. దరఖాస్తు విధానం ఎంతో సులభమని , ఏమైనా సందేహాలు ఉన్న, ఇబ్బందులు ఎదురైన తమ సిబ్బంది సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.