తెలంగాణలో రిటైరైన ఉద్యోగుల్లో 80 శాతం ఇంకా విధుల్లోనే... కొత్త వారికి చోటెక్కడ?

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023, డిసెంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కోసం ఆయన ప్రభుత్వ శాఖల సర్వేకు ఆదేశించారు.

Update: 2024-06-17 14:45 GMT

తెలంగాణలో రిటైరైన ఉద్యోగుల్లో 80 శాతం ఇంకా విధుల్లోనే... కొత్త వారికి చోటెక్కడ?

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో రిటైరైన ఉద్యోగుల్లో దాదాపు 80 శాతం మంది సర్వీసులో కొనసాగుతున్నారు. దాంతో, కింది ఉద్యోగులకు ప్రమోషన్లు రావడం లేదు. కొత్త వారికి ఉద్యోగాలు రావడం లేదు.


రిటైరైన ఉద్యోగుల్లో 20 శాతమే వెళ్ళిపోయారు

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 2023, డిసెంబర్ లో బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కోసం ఆయన ప్రభుత్వ శాఖల సర్వేకు ఆదేశించారు. ఈ క్రమంలోనే పలు శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులనే కొనసాగిస్తున్నట్టుగా గుర్తించారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగుల్లో 20 శాతం మంది విధులకు దూరంగా ఉన్నారు. మిగిలిన 80 శాతం మంది వివిధ హోదాల్లో ఆయా శాఖల్లోనే కొనసాగుతున్నారు. రిటైరైన హోదాల్లోనే విధులు నిర్వహిస్తున్నందున కిందిస్థాయి ఉద్యోగుల ప్రమోషన్లకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. వైద్య, ఆరోగ్యశాఖ, ఇరిగేషన్, విద్యాశాఖ, రోడ్లు, భవనాలు, పౌరసరఫరాల శాఖల్లో రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగిస్తున్నారు. మున్సిపల్ శాఖలో 180, విద్యాశాఖలో 88, రోడ్లు, భవనాల శాఖలో 80, పౌరసరఫరాల శాఖలో 75, ఇరిగేషన్ లో 70 మంది పనిచేస్తున్నారు.

రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపుతో రిక్రూట్ మెంట్ పై ఎఫెక్ట్

రిటైర్డ్ అయిన ఉద్యోగులను తిరిగి అదే స్థానంలో కొనసాగించడం కొత్త ఉద్యోగుల భర్తీపై ప్రభావం చూపుతుంది. ఒక్క రిటైర్డ్ ఉద్యోగిని కొనసాగించడం నలుగురు ఉద్యోగులపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు వందల మంది ఉద్యోగులు ప్రమోషన్లు లేకుండానే రిటైరైన పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నాలుగైదు నెలల్లోనే చాలా మంది ఉద్యోగులు ప్రమోషన్లు లేకుండానే రిటైరయ్యారు. ప్రమోషన్లు లేని కారణంగా ఆయా శాఖల్లో ఖాళీలు ఏర్పడడం లేదని టీజీఓ నేత ప్రతాప్ చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులను కొనసాగించే పద్దతికి తాము వ్యతిరేకమన్నారు.

ఏళ్ల తరబడి రిటైర్డ్ ఉద్యోగుల కొనసాగింపు

ఒక్క రోజు రిటైర్డ్ ఉద్యోగి సేవలు ఉపయోగించుకున్నా ఉద్యోగుల ప్రమోషన్లపై ప్రభావం ఉంటుంది. కొన్ని శాఖల్లో ఏళ్ల తరబడి రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వం కొనసాగిస్తుంది. కొన్ని శాఖల్లో 10 ఏళ్ల పాటు రిటైర్డ్ ఉద్యోగుల సేవలను ఉపయోగించుకుంటుంది. ఒక శాఖలో ఓ మహిళా అధికారి రిటైరైన తరువాత 10 ఏళ్లకు పైగా పని చేస్తున్నారు.

ఇరిగేషన్ శాఖలో మురళీధర్ రావు, వెంకటేశ్వర్లు రిటైర్డ్ అయినా కూడా ప్రభుత్వం వారిని విధుల్లో కొనసాగించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం వెలుగులోకి రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ మురళీధర్ రావును రాజీనామా చేయాలని కోరింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. మరో ఉన్నతాధికారి వెంకటేశ్వర్లును ప్రభుత్వం తొలగించింది. రిటైరైన ఐఏఎస్ అధికారులను కూడా ప్రభుత్వం కొనసాగించింది. అధర్ సిన్హాతో పాటు మరో ఐఎఎస్ అధికారికి కూడా ప్రభుత్వం ఎక్స్ టెన్షన్ ఇచ్చింది. హైద్రాబాద్ జలమండలిలో రిటైరైన తర్వాత కూడా ఓ అధికారి విధులు నిర్వహిస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సేవలను వాడుకోవాలంటే ప్రైవేట్ గా వారి సేవలను ఉపయోగించుకోవాలని టీజీఓ నేత ప్రతాప్ ప్రభుత్వానికి సూచించారు.


ఉద్యోగుల సమస్యలపై రేవంత్ సర్కార్ కమిటీ

ఉద్యోగుల సమస్యపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. 317 జీవో సహా ఇతర సమస్యలపై శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహలతో కేబినెట్ సబ్ కమిటి ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 317 జీవో విషయమై ఉద్యోగుల సమస్యలపై ఈ కమిటీ పనిచేస్తుంది. జి. చిన్నారెడ్డి, కోదండరామ్, ఐఎఎస్ అధికారి దివ్యలతో మరో కమిటీని కూడ రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసింది. ఉద్యోగుల డిమాండ్లపై ఈ కమిటీ చర్చించనుంది. ప్రతి ఏటా సాధారణ బదిలీలు పూర్తి చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. మంత్రుల కమిటీతో పాటు చిన్నారెడ్డి కమిటీల రిపోర్టు ఆధారంగా తమ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు చెప్పారు.

నీళ్లు, నిధులు, నియామకాలపై ఆధారపడి తెలంగాణ ఉద్యమం సాగింది. అయితే, ఉద్యోగుల సమస్యలను పాలకులు పట్టించుకోలేదనే అభిప్రాయాలు ఉద్యోగ సంఘాల నేతల్లో ఉన్నాయి. కొత్తగా అధికారంంలోకి వచ్చిన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ పెట్టాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు.

Tags:    

Similar News