Road Accident: పార్టీ చేసుకుని పయనమయ్యారు.. చెరువులో శవాలై తేలారు..
Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్ పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి చెప్పారు.
Road Accident: యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్ పూర్ వద్ద చెరువులోకి కారు దూసుకెళ్లడానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని చౌటుప్పల్ ఏసీపీ మధుసూదన్ రెడ్డి చెప్పారు. ఈ ప్రమాదం నుంచి మణికంఠ అనే యువకుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. జలాల్ పూర్ గ్రామ సమీపంలోని ప్రమాదకరమైన మలుపు కూడా ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ మలుపు వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు శనివారం నాడు నిరసనకు దిగారు.
హైదరాబాద్ ఎల్ బీ నగర్ కు చెందిన ఆరుగురు స్నేహితులు రామన్నపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఆరుగురు యువకులు స్నేహితులు. ఇంటర్ మధ్యలోనే చదువును ఆపేశారు. శుక్రవారం రాత్రి పదకొండున్నర సమయంలో ఎల్ బీ నగర్ లోనే వీరంతా పార్టీ చేసుకున్నారు. శనివారం మణికంఠ గ్రామం లక్ష్మాపూర్ లో ఈతకల్లు కోసం బయలుదేరారు. శనివారం తెల్లవారుజామున జలాల్ పూర్ వద్ద కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. కారు అద్దాలు పగులగొట్టి మణికంఠ సురక్షితంగా బయటపడ్డారని ఏసీపీ మధుసూదన్ రెడ్డి చెప్పారు. మణికంఠకు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తే 58 పాయింట్లు చూపిందని ఆయన తెలిపారు.
వారం రోజుల్లో హెచ్చరిక బోర్డులు
ఈ మలుపు వద్ద వారం రోజుల్లోపుగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తామని అధికారులు గ్రామస్తులకు హమీ ఇచ్చారు. ఈ ప్రమాదంపై స్థానికులు మలుపు వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. అధికారులతో గ్రామస్తులు చర్చించారు. వారం రోజుల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసేందుకు అధికారులు హామీ ఇవ్వడంతో నిరసనను విరమించారు.