ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1700 స్కూల్ బస్సులు.. సుమారు 630 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్
*తప్పనిసరిగా ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకోవాలంటున్న రవాణాశాఖ
Karimnagar: తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభమయ్యాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు మూలాన పడ్డ స్కూల్ బస్సులు మళ్ళీ రోడ్డెక్కాయి. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తు్న్న యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఆ బాధ్యత కరీంనగర్ జిల్లాలోని చాలా విద్యాసంస్థల్లో కనపడటం లేదనే విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థల బస్సుల్లో కనీసం 40 శాతం కూడా ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందలేదు. ఏడాదికి ఒకసారి తప్పనిసరిగా రవాణాశాఖ నుండి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ హెచ్చరికలు జారీ చేసినా చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నాయి విద్యాసంస్థలు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుమారు 1700 స్కూల్ బస్సులున్నాయని రవాణా శాఖ లెక్కలు చెబుతున్నాయి. వీటి ఫిట్‌నెస్ గత నెలాఖరుతో ముగిసినా ఇప్పటి వరకు 630 బస్సులు మాత్రమే ఫిట్‌నెస్ పరీక్షలు చేయించుకున్నాయి. తనిఖీల సమయంలో రాజకీయ పలుకుబడితో కొందరు.. పైరవీలతో మరికొందరు తప్పించుకుంటున్నారు. ఫలితంగా ఉన్న బస్సుల్లో 40 శాతానికి పైగా ఎలాంటి ఫిట్‌నెస్ లేకుండానే రోడ్డెక్కుతున్నాయి. మరోవైపు అనుభవం లేని డ్రైవర్లను నియమించుకోవడం, వయసు పైబడిన వాహనాలను వాడటం అత్యంత ప్రమాదకరంగా మారింది.
ఇదిలా ఉంటె కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలలను ఆటోలు, ప్రైవేట్ వ్యాన్లలో పాఠశాలలకు తరలించడం మరింత ప్రమాదం అంటున్నారు రవాణా శాఖ అధికారులు. త్వరలోనే యాజమాన్యాలకు, డ్రైవర్లకు అవగాహన కల్పిస్తామని జిల్లా రవాణా శాఖ కమిషనర్ తెలిపారు. విద్యాసంస్థల అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడి తప్పకుండా ఫిట్‌నెస్ చేసుకునే విషయంపై సూచనలు చేస్తామన్నారు DTC చంద్రశేఖర్ గౌడ్.