Coronavirus Positive cases:కరీంనగర్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. కరీంనగర్‌తోపాటు జమ్మికుంటలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. కరీంనగర్ వృద్ధాశ్రమంలో ఏకంగా 25మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే, ఒకవైపు కేసులు పెరిగిపోతున్నా, వైద్యారోగ్యశాఖ అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
కరీంనగర్‌లో కరోనా కల్లోలం రేపుతోంది. రోజురోజుకీ కేసులు సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కరీంనగర్‌తోపాటు జమ్మికుంటలో అత్యధిక కేసులు నమోదవుతుండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. దాంతో అత్యవసరమైతేనే తప్ప జనం ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు 865మందికి వైరస్ సోకగా, ఇక్క కరీంనగర్ పట్టణంలోనే 500 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్‌లోని వృద్ధాశ్రమంలో 25మందికి కరోనా రావడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. దాంతో, వృద్ధాశ్రమంలో భయాందోళనలు నెలకొన్నాయి.
కరీంనగర్ వృద్ధాశ్రమంలో 25మందికి కరోనా సోకినట్లు తేలినా, మిగతా వాళ్ల రక్షణ విషయంలో వైద్యారోగ్యశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అంటున్నారు. వృద్ధాశ్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్య సిబ్బంది మెడికల్ వేస్టేజ్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే, ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో తెలియని పరిస్థితుల్లో ఇలా మెడికల్ వేస్టేజ్‌ను ఆశ్రమం దగ్గరే వదిలేసి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు, కరీంనగర్‌లో రోజుకి సుమారు 60 కేసులు నమోదవుతుంటే, అవి ఎక్కడెక్కడ వచ్చాయో చెప్పడం లేదని, దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండే అవకాశం లేకుండా పోతోందని విపక్ష నేతలు అంటున్నారు.
కరీంనగర్ జిల్లా అంతటా కరోనా మహమ్మారి విస్తరిస్తున్నా, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటి నుంచైనా నమోదవుతున్న కేసుల సంఖ్యతోపాటు, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో ఏరియా వైజ్‌గా వివరాలు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.