తెలంగాణలో కరోనా రహితంగా 11 జిల్లాలు.. మూడు జిల్లాల్లో నమోదు కాని ఒక్క కేసు..
తెలంగాణ వేగంగా కరోనా నుంచి కోలుకుంటోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. ఇదే సమయంలో చికిత్స పొంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న పకడ్బంది చర్యలు సత్పలితాలు ఇస్తున్నాయి. రోజు నమోదవుతున్న కొత్త కేసులు సింగల్ డిజిట్ దాటడం లేదు. దీంతో రాష్ట్రంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుందని చెప్పొచ్చు.
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది. లాక్‌డౌన్‌తో వైరస్ కట్టడి ఊరట కలిగిస్తోంది ఇప్పుడు 11 జిల్లాలు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు సడలించి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 33 జిల్లాల్లో యాదాద్రి భువనగిరి, వనపర్తి, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో ఇంతవరకు ఒక్క కరోనా పాజిటీవ్ కేసు కూడా నమోదు కాలేదు. దీంతో ముందు నుంచీ ఈ మూడు జిల్లాల్లో కరోనా ప్రభావం లేని జిల్లాలుగా ఉన్నాయి.
తాజాగా సిద్ధిపేట, మహబూబాబాద్, మంచిర్యాల, నారాయణపేట, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, ములుగు జిల్లాల్లో కరోనా పాజిటీవ్‌గా నిర్ధారణ అయిన వారు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఈ జిల్లాల్లో ఇప్పుడు ఒక్క కరోనా కేసు కూడా లేదు. మొత్తంగా 11 జిల్లాలు ఇప్పుడు కరోనా ఫ్రీ జిల్లాలుగా మారాయి. ఈ 8 జిల్లాలకు చెందిన పాజిటివ్ కేసులున్న వారందరికీ వ్యాధి నయమై వెళ్లిపోయారు. దీంతో ఈ జిల్లాలన్నింటినీ ప్రభుత్వం కరోనా రహిత జిల్లాలుగా ప్రకటించింది
రాష్ట్రంలో నిన్న కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అవన్నీ జీహెచ్‌ఎంసీ పరిధిలోనివేనని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1016కి చేరింది. తాజాగా 35 మంది డిశ్చార్జి కాగా... ఇప్పటి వరకు 409 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం 582 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో మరణాల రేటు 2.5గా ఉందని మరణాల రేటును మరింత తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతున్నారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో 10 మంది ఐసీయూలో ఉన్నారని అధికారులు తెలిపారు. వారిలో ఒకరు వెంటిలేటర్‌పై ఉండగా మిగిలినవారు ఆక్సిజన్ సాయంతో చికిత్సపొందుతున్నారు. ఇద్దరికి డయాలసిస్ సేవలందిస్తుండగా మరొకరు నోటి క్యాన్సర్‌తో ఇంకొకరు లింఫోమా, ఒకరు క్లోమగ్రంథి క్యాన్సర్‌తో, నలుగురు గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. గాంధీవైద్యులు నిరంతరంగా సేవలందిస్తున్నారని వారి పర్యవేక్షణలో అందరూ తర్వగా కోలుకుంటారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.