భారత బ్యాడ్మింటన్ నుదుట స్వర్ణ 'సింధూ'రం

నాలుగు దశాబ్దాల కల నెరవేరిన రోజు. స్వర్ణ సింధూరం భారత బ్యాడ్మింటన్ నుదుట మెరిసిన రోజు. ఆదివారం సింధూర వారంగా లిఖితమైంది. భారత బ్యాడ్మింటన్ ప్రపంచ పసిడి కిరీటధారణ జరిపి తన పేరును సింధూరాక్షరాలతో చరిత్రలో తానే రాసేసింది పీవీ సింధు.

Update: 2019-08-25 14:28 GMT

దిగ్గజాలు అనుకున్నవాళ్ళకి సాధ్యం కాలేదు.. వీరు కచ్చితంగా సాధిస్తారనుకున్న వారు మౌనంగా నిష్క్రమించారు.. నాలుగు దశాబ్దాల బ్యాడ్మింటన్ లో ప్రపంచస్థాయిలో పేరుపొందిన భారతీయుల కల.. కానీ ఆమెకు అది జీవిత లక్ష్యం. ఏ టోర్నీ గెలిచినా సరే ఆమెది ఎప్పుడూ అదే మాట నేను ప్రపంచాన్ని జయిస్త్తాను. అది ఆమె జీవిత లక్ష్యం. భారతావని బ్యాడ్మింటన్ నుదుట పసిడి సింధూరాన్ని లిఖించాలనే ఏకైక ఎజెండా. దానికోసం చేసిన ప్రయత్నాల్లో మూడుసార్లు చివరి మెట్టుపై పట్టు తప్పి జారిపోయింది. అయినా తన లక్ష్యపు పట్టు మాత్రం మరింత బిగించింది. 24 ఏళ్ల వయసులో నాలుగోసారి తన తపనను దిగ్విజయంగా నెరవేర్చుకుంది. ఆమె పూసర్ల వెంకట సింధు. ఆ కల ప్రపపంచ ఛాంపియన్ షిప్ టోర్నీలో స్వర్ణ పతకం సాధించడం. ఈ ఆదివారం ఆ స్వప్నాన్ని నిజం చేసుకుంది. ఇది ఆషామాషీగా వచ్చిన విజయం కాదు. దిగ్గజ ప్రత్యర్థుల్ని చిత్తు చేసి ఒక్కో రౌండ్ దాటుతూ వచ్చి స్వర్ణ శిఖరాన్ని అందుకున్న విజయశోభ. తెలుగు తేజం సింధు.. బ్యాడ్మింటన్ స్టార్.. ఎన్నో టోర్నీలు గెలిచి భారత బ్యాడ్మింటన్ దిగ్గజంగా ఎదిగిన తార. ఆ విజయాలేవీ కూడా ఆమెకు తృప్తి ఇవ్వలేదు. ప్రతి విజయం సందర్భంలోనూ అమెది ఒకటే మాట ప్రపంచ చాంపియన్ టైటిల్ గెలవాలి. వరుసగా నాలుగు సార్లు ఫైనల్ కి చేరి చరిత్ర సృష్టించింది. ఆ చరిత్రకు మించిన అద్భుతాన్ని సాధించి సింధూర స్వర్నంతో మెరిసింది.

సొగసైన షాట్లు.. కచ్చితత్వం.. అద్భుత స్మాష్ లు.. ఆత్మవిశ్వాసం.. అంతకు మించిన పట్టుదల.. ప్రత్యర్థికి తేరుకునే అవకాశమే దక్కనీయకుండా.. వరుస సెట్లలో సంచలనం సృష్టించింది. ఆదివారం జరిగిన ఫైనల్ లో సింధు ఆటతీరు వర్ణించడానికి పదాలు చాలవు. ప్రస్తుతం ఐదో ర్యాంకులో ఉన్న సింధు.. తనకన్నా ఒక ర్యాంకు(4వ ర్యాంక్) మెరుగైన జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహారా పై అద్వితీయ విజయంతో స్వర్ణపతకం సాధించింది. వరుస సెట్లలో 21-7, 21-7 తేడాతో ఒకుహారా ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా విశ్వవిజేతగా అవతరించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఒక్క తప్పు కూడా చేయలేదు సింధు.

ఫోబియా అన్నవారికి సమాధానం..

సింధు దాదాపుగా ఏ టోర్నీలో అయినా ఫైనల్ వరకూ దూసుకు పోతుంది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో చిన్నచిన్న పొరపాట్లతో టోర్నీ చేజారిపోతుండడం జరగడం ఎక్కువసార్లు అయింది. దీనితో విశ్లేషకులు.. విమర్శకులు సింధు కు ఫైనల్ ఫోబియా ఉందంటూ చెప్పుకువస్తుంటారు. ఇప్పుడు ఈ విజయంతో ఆ మాటకు తన ఆట తీరుతో సమాధానం చెప్పింది సింధు.

తీరిన ప్రతీకారం..

జపాన్ క్రీడాకారిణి నోజోమి ఒకుహారా పై 2017 లో ప్రపంచ కప్ ఫైనల్స్ లో పోరాడి ఓడింది సింధు. దాంతో రజత పతకం తొ సరిపెట్ట్టుకోవాల్సి వచ్చింది. దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంది సింధు. వరుస సెట్లలో ప్రత్యర్థిని గుక్కతిప్పుకోనీయకుండా చేసి మరీ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది సింధు.


Tags:    

Similar News