ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్: ప్రపంచ బ్యాడ్మింటన్ స్టార్ లిన్ డాన్‌కు ప్రణయ్ షాక్!
ఒకసారి.. రెండుసార్లు కాదు ఏకంగా ఐదు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్.. రెండు ఒలింపిక్ స్వర్ణ పతకాలు.. ప్రపంచంలోని బ్యాడ్మింటన్ క్రీడాకారులకు ఆరాధ్య ఆటగాడు.. చైనాకు చెందిన లిన్ డాన్! అటువంటి యోధుడ్ని మూడోసారి ఓడించి చరిత్ర సృష్టించాడు భారత్ బ్యాడ్మింటన్ స్టార్ ప్రణయ్. గతంలో రెండుసార్లు అతన్ని ఓడించిన ప్రణయ్ మంగళవారం జరిగిన ప్రపంచ చంపియన్ షిప్ పోటీల్లో మరోసారి ఓటమి పాలు చేశాడు. దీంతో మూడుసార్లు చైనా స్టార్ ను ఓడించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
అంతర్జాతీయంగా నిలకడగా విజయాలు సాధిస్తున్న ప్రణయ్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సత్తా చాటుతున్నాడు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో లిన్ డాన్ (చైనా) తో తలపడిన ప్రణయ్ 21–11, 13–21, 21–7తో గెలుపొంది సంచలనం సృష్టించాడు. ప్రపంచ 17వ ర్యాంకర్ లిన్ డాన్‌తో ఇప్పటివరకు ఐదుసార్లు తలపడ్డ ప్రణయ్ ముఖాముఖి రికార్డులో 3–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఈ మ్యాచ్‌కంటే ముందు 2015 ఫ్రెంచ్ ఓపెన్‌లో, 2018 ఇండోనేసియా ఓపెన్‌లో లిన్ డాన్‌పై ప్రణయ్ గెలిచాడు. దీంతో లిన్ డాన్‌ను మూడుసార్లు ఓడించిన తొలి భారతీయ ప్లేయర్‌గా ప్రణయ్ రికార్డు నెలకొల్పాడు. గతంలో లిన్ డాన్‌పై పుల్లెల గోపీచంద్ రెండుసార్లు... ప్రస్తుత భారత నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ ఒకసారి గెలిచారు.
62 నిమిషాలపాటు జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో ప్రణయ్ మొదట్నుంచీ దూకుడుగా ఆడాడు. తన సహజశైలిలో ఆడిన ప్రణయ్ తొలి గేమ్‌లో 10–5, 19–11తో ఆధిక్యంలోకి వెళ్లి అదే జోరులో గేమ్‌ను గెలిచాడు. రెండో గేమ్‌లో తడబడ్డ ప్రణయ్... నిర్ణాయక మూడో గేమ్‌లో జూలు విదిల్చాడు. స్కోరు 6–5తో ఉన్నదశలో ప్రపంచ 30వ ర్యాంకర్ ప్రణయ్ ఒక్కసారిగా విజృంభించి వరుసగా ఎనిమిది పాయింట్లు గెలిచి 14–5తో ముందంజ వేశాడు. ఆ తర్వాత చైనా ప్లేయర్‌కు రెండు పాయింట్లు కోల్పోయిన ప్రణయ్ మరో ఏడు పాయింట్లు సాధించి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు.
మరో రెండో రౌండ్ మ్యాచ్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాయిప్రణీత్ 21–16, 21–15తో లీ డాంగ్ కెయున్ (దక్షిణ కొరియా)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నాడు.
డబుల్స్ లో మిశ్రమ ఫలితాలు...
మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంటకు చాంగ్ చింగ్ హుయ్–యాంగ్ చింగ్ తున్ (చైనీస్ తైపీ) జోడీ నుంచి వాకోవర్ లభించింది. దండు పూజ–సంజన ద్వయం 15–21, 14–21తో సు యా చింగ్–హు లింగ్ ఫాంగ్ (చైనీస్ తైపీ) జంట చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి 21–13, 21–13తో థామ్ గికెల్–రోనన్ లేబర్ (ఫ్రాన్స్)లపై... ఎం.ఆర్.అర్జున్–శ్లోక్ రామచంద్రన్ 21–14, 21–16తో తొబియాస్ కుయెంజి–ఒలివర్ షాలెర్ (స్విట్జర్లాండ్)లపై గెలిచారు. మరో మ్యాచ్‌లో అరుణ్ జార్జి–సాన్యమ్ శుక్లా 18–21, 11–21తో టకుటో ఇనుయు–యుకీ కనెకో (జపాన్) చేతిలో ఓడిపోయారు.