ఈసారైనా పసిడి వెలితి తీరేనా?

ప్రపంచ బ్యాడ్మింటన్ లో గత ఐదేళ్లుగా భారత ప్రభ వెలిగిపోతోంది. మన తెలుగు తేజాలు పతకాలు సాధించి సత్తా చాటారు. అయితే.. పసిడి పతకం మాత్రం ఈ టోర్నీలో సాధించలేకపోయారు. ఈసారైనా ఆ కాల నెరవేరాలని అభిమానులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈరోజు నుంచి టోర్నీ ప్రారంభం కాబోతోంది.

Update: 2019-08-19 02:52 GMT

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్.. బ్యాడ్మింటన్ లో అత్యున్నత టోర్నీ. ఈ టోర్నీలో మన దేశం తరపున ఆడాలని ప్రతి షట్లర్‌ ఆశిస్తాడు. ఇక్కడ పతకం సాధించాలని తపన పడతాడు. అయితే, మన దేశంలో 1983లో ప్రకాష్ పాడుకొనే ఒక రజత పతకం గెలిచాడు. తరువాత దాదాపు మూడు దశాబ్దాల పాటు పతకం ఊసే లేకుండా పోయింది. అయితే, ఆ చరిత్రను చెరిపేస్తూ గుత్తా జ్వాల, అశ్విని లు కాంస్య పతాకాన్ని సాధించారు. తరువాత నుంచి మన దేశానికి పతకాలు సాధించడం మామూలు విషయంగా మారిపోయింది. దీనికి కారణం మన బ్యాడ్మింటన్ స్టార్ లు పీవీ సింధు, సైనా నెహ్వాల్ లు. వీళ్ళిద్దరూ ఐదేళ్ళలో ఆరు పతకాలు సాధించారు. దీంతో భారత బ్యాడ్మింటన్ మురిసింది. కానీ, ఈ పతకాలలో పసిడి మెరుపు ఒక్కటీ లేదు. అదిప్పుడు బ్యాడ్మింటన్ అభిమానుల తీరని కలగా వెన్నాడుతోంది.

ఈరోజు(సోమవారం) నుంచి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి. మన దేశంలో పేరున్న షట్లర్స్ అందరూ ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఈ సారైనా వీరిలో ఎవరన్నా ఒకరు స్వర్ణ పతక దారులవుతారా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఆశల పల్లకిలో ఆ ముగ్గురు..

భారత్ తరఫున బరిలోకి దిగుతున్న వారిలో సింధు, సైనా, శ్రీకాంత్ ముగ్గురి మీదే ప్రధానంగా అభిమానులు ఆశలు పెంచుకున్నారు. అందరిలోనూ సింధు మీద ఎక్కువ అంచనాలున్నాయి. ఎందుకంటే 2017, 2018 వరుసగా రెండుసార్లు ఈ టోర్నీ ఫైనల్స్ వరకూ చేరుకుంది ఈ తెలుగు తేజం. అయితే, రెండుసార్లూ ప్రత్యర్థి పై పోరాడి ఓడింది. దీంతో రజత పతకాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అంతకు ముందు సంవత్సరం ఆమె కాంస్య పతకం గెలిచింది. అంటే ఈ టోర్నీలో స్వర్ణం తప్ప మిగిలిన పతకాలని సాధించింది సింధూ. ఇప్పుడు ఈ టోర్నీలో ఎలాగైనా స్వర్ణ పతాకాన్ని పట్టేయాలన్న పట్టుదలతో రంగంలోకి దిగుతోంది సింధు. ఆ కల నెరవేరుస్తుందని అభిమానులూ ఆశతో ఉన్నారు.

ఇక సైనా పైన కూడా చాలా అంచనాలు ఉన్నాయి. కానీ, ఆమె ఫాం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకూ ఆమె ప్రపంచ టోర్నీలో రెండు పతకాలు (ఓ రజతం (2015), ఓ కాంస్యం (2017)) గెలుచుకుంది. ఈసారి ఆమె గురి స్వర్ణం పై ఉంది. అయితే, గత సంవత్సరంలో ఆమె ఒక్క పెద్ద టోర్నీ గెలవలేదు. ప్రపంచ కప్ లోనూ విఫలం అయింది. దీంతో ఆమె ఎంత పుంజుకోగలదనే విషయంలో కొంత ఆందోళన నెలకొంది.

శ్రీకాంత్ ఒకప్పుడు వరుసగా సూపర్ టైటిల్స్ గెలిచి భారత బ్యాడ్మింటన్ లో సంచలనం సృష్టించాడు. గత రెండేళ్లుగా ఇతనికి చెప్పుకోతగ్గ విజయాలు లేవు. కనీ, ఒక్కసారి పున్జుకుంటే ప్రత్యర్థులకు చుక్కలు చూపించగల నైపుణ్యం శ్రీకాంత్ స్వంతం ఇప్పుడు ఆ నైపుణ్యం మీదే అందరూ ఆశలు పెంచుకుంటున్నారు.

వీరే కాకుండా, సాయిప్రణీత్‌, సమీర్‌ వర్మ, ప్రణయ్ వంటి క్రీడాకారులు ఈ టోర్నీలో భారత్ తరఫున బరిలో ఉన్నారు. ఈ టోర్నీలో ఎవరైనా ఒక్కరు స్వర్ణ పతాకాన్ని పట్టుకుని పసిడి వెలితిని తీరుస్తారని అభిమానులు గంపెడాశతో ఉన్నారు.


Tags:    

Similar News