ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్: తొలిరౌండ్ లో దాటిన భారత్ ఆటగాళ్లు
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ తొలి రౌండ్ లో మెన్స్ సింగిల్స్ లో భారత స్టార్ ఆటగాళ్ళు ముందంజ వేశారు.
కొంచెం కష్టపడినా.. విజయం సాధించి ముందడుగు వేశారు భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లు. తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న ఆటగాళ్ల పై పోరులో శ్రీకాంత్, ప్రణయ్, సాయిప్రణీత్ పై చేయి సాధించి రెండో రౌండ్ లోకి అడుగుపెట్టారు. . శ్రీకాంత్, ప్రణయ్ ఒక్కో గేమ్ కోల్పోయి విజయాన్ని అందుకోగా... సాయిప్రణీత్ వరుస గేముల్లో గెలుపొంది రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు.
సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఏడో సీడ్ శ్రీకాంత్ 66 నిమిషాల్లో 17–21, 21–16, 21–6తో ప్రపంచ 81వ ర్యాంకర్ ఎన్‌హట్ ఎన్గుయెన్ (ఐర్లాండ్)పై... సాయిప్రణీత్ 40 నిమిషాల్లో 21–17, 21–16తో 66వ ర్యాంకర్ జేసన్ ఆంథోని హో–షుయె (కెనడా)పై... ప్రణయ్ 59 నిమిషాల్లో 17–21, 21–10, 21–11తో 93వ ర్యాంకర్ ఈటూ హీనో (ఫిన్‌లాండ్)పై విజయం సాధించారు.
ఇక ఇతర మ్యాచుల్లో ..డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ కెంటో మొమోటా (జపాన్), చైనా దిగ్గజం లిన్ డాన్, నాలుగో సీడ్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా), ఆరో సీడ్ ఆంథోని జిన్‌టింగ్ (ఇండోనేసియా), ఐదో సీడ్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), మూడో సీడ్ చెన్ లాంగ్ (చైనా) కూడా రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో మేఘన–పూర్వీషా (భారత్) జంట 21–10, 21–18తో డయానా–నిక్తె సోటోమేయర్ (గ్వాటెమాలా) జోడీపై గెలిచింది.