IND vs SA 3rd Test: కేప్ టౌన్ టెస్ట్‌లో స్పెషల్ రికార్డులు.. లిస్టులో విరాట్ కోహ్లీ, బుమ్రా.. అవేంటంటే?
India vs South Africa 3rd Test: టీమిండియా టెస్ట్ సారథి విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌లో తన 100 క్యాచ్‌లను పూర్తి చేసి, సరికొత్త రికార్డును పూర్తి చేశాడు.
India vs South Africa 3rd Test: టీమిండియా టెస్ట్ సారథి విరాట్ కోహ్లి టెస్టు క్రికెట్‌లో తన 100 క్యాచ్‌లను పూర్తి చేసి, సరికొత్త రికార్డును పూర్తి చేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టెస్టు సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో తన పేరిట మరో రికార్డును నమోదు చేసుకున్నాడు. భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ వేసిన ఓ బంతిని సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ టెంబా బావుమాను స్లిప్‌లోకి తరలించాడు. అయితే 33 ఏళ్ల విరాట్ కోహ్లీ అద్భుతంగా తన ఎడమ చేతితో క్యాచ్ పట్టడం ద్వారా ఈ స్పెషల్ రికార్డును సాధించాడు.
దీంతో టెస్టు క్రికెట్‌లో 100 లేదా అంతకంటే ఎక్కువ క్యాచ్‌లు పట్టిన ఆరో భారతీయుడిగా కోహ్లీ నిలిచాడు. భారత కెప్టెన్ తన 99వ టెస్టులో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ కంటే ముందు రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, మహ్మద్ అజారుద్దీన్ ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఈ లిస్టులో టీమిండియా టెస్ట్ సారథి చేరాడు.
టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ క్యాచులు పూర్తి చేసిన భారత ప్లేయర్లను ఓసారి చూద్దాం..
రాహుల్ ద్రవిడ్ 163 మ్యాచ్‌ల్లో 209 క్యాచ్‌లు తీసుకుని అగ్రస్థానంలో నిలిచాడు.
ఆ తరువాత వీవీఎస్ లక్ష్మణ్ 134 మ్యాచ్‌ల్లో 135 క్యాచ్‌లు అందుకుని రెండో స్థానంలో నిలిచాడు.
ఇక మూడో స్థానంలో లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిచాడు. సచిన్ 200 మ్యాచ్‌ల్లో 115 క్యాచ్‌లు అందుకున్నాడు.
సునీల్ గవాస్కర్ 125 మ్యాచ్‌ల్లో 108 క్యాచ్‌లు అందుకుని నాలుగో స్థానంలో నిలిచాడు.
భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ ఈ లిస్టులో ఐదో స్థానంలో నిలిచాడు. అజారుద్దీన్ 99 మ్యాచుల్లో 105 క్యాచ్‌లు అందుకున్నాడు.
ప్రస్తుత టీమిండియా టెస్ట్ సారథి విరాట్ కోహ్లీ కూడా 99 మ్యాచ్‌ల్లో 100 క్యాచ్‌లు అందుకుని ఈ ఎలైట్ ఇండియన్ క్రికెటర్ల జాబితాలో చేరాడు.
జస్ప్రీత్ బుమ్రా స్పెషల్ రికార్డు..
తొలి ఇన్నింగ్స్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 42 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. సౌతాఫ్రికాపై రెండోసారి బుమ్రా అద్భుత ప్రదర్శన చేశాడు. అదే సమయంలో టెస్టు క్రికెట్‌లో బుమ్రా ఏడోసారి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్ తర్వాత 27 టెస్టుల్లో ఈ ఘనత సాధించిన మూడో భారత బౌలర్‌గా నిలిచాడు.
కేప్‌టౌన్‌లో హర్భజన్ సింగ్, ఎస్ శ్రీశాంత్ తరువాత ఓ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. హర్భజన్ సింగ్ 2010/11లో 7 వికెట్లు పడగొట్టగా, ఎస్ శ్రీశాంత్ కూడా అదే ఏడాది 5 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం 2022లో బుమ్రా 5 వికెట్లు తీసి వారి సరసన చేరాడు.