బంగ్లా పై గెలుపుతో సెమీస్ చేరుకున్న భారత్

Update: 2019-07-03 01:28 GMT

నాకౌట్ కు చేరారు. సులువుగా వెళతారని అభిమానులు భావిస్తే.. కష్టం మీద.. చమటోడ్చి..సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ లుగా పరిగణించిన జట్టు ఇటువంటి పరిస్థితిలో నాకౌట్ కు చేరడం కొద్దిగా విచారించాల్సిన విషయమే. అప్రతిహతంగా దూసుకుపోతున్న జట్టు ఒక్కసారిగా పడుతూ లేస్తూ ముందుకు సాగుతుందంటే ఆలోచించాల్సిన విషయమే.

టీమిండియా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఎన్నో లోపాల్ని బయట పెట్టుకుంది.. మరెన్నో సందేహాల్ని రేకెత్తించింది. 350 పరుగులు సాధించాల్సిన స్థితిలో 314 పరుగులకే పరిమితమైంది భారత్. 179 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచుకు వచ్చిన బంగ్లాదేశ్ 286 పరుగులు చేసింది.. దాదాపు అన్ని ఓవర్లూ ఆడింది. ఈ లెక్కలు చాలు భారత జట్టు ఎలా మ్యాచ్ గెలిచిందో చెప్పటానికి.

టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టుకు మంచి ఆరంభం లభించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన సహజశైలికి భిన్నంగా మొదట్నుంచే దూకుడుగా ఆడాడు. అతనికి తోడుగా కే ఎల్ రాహుల్ నిలబడ్డాడు. దీంతో 180 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది ఇండియా. ఆ తరువాత రోహిత్, రాహుల్ వరుసగా అవుట్ కావడంతో అసలు కథ ప్రారంభం అయింది. కోహ్లీ, పంత్ చక్కగా ఆడుతున్నట్టు కనిపించారు. అయితే, 39 వ ఓవర్లో ముస్తాఫిజుర్‌.. ఒక్క పరుగూ ఇవ్వకుండా కోహ్లి (26), పాండ్య (0)లను ఔట్‌ చేయడంతో కథ మారిపోయింది. భారీ స్కోరు ఖాయమనుకున్న మ్యాచ్ 300 దాటుతారా అనిపించేలా చేసింది. ఒక పక్క పంత్ స్కోరు బోర్డును పరిగెత్తిన్చినా..ధోనీ వేగంగా ఆడలేకపోయాడు. దీంతో చివరి 12 ఓవర్లలో ఇండియా 7 వికెట్లు కోల్పోయి 77 పరుగులే చేసింది. మొత్తమ్మీద 314 పరుగులు చేసింది.

బంగ్లాదేశ్ అద్భుత పోరాటం..

భారీ లక్ష్యాన్ని చేదించడానికి బంగ్లాదేశ్ అద్భుతంగా ప్రయత్నించింది. టీమిండియా లాంటి జట్టు మీద ఎక్కడా తగ్గకుండా పోరాటం చేసింది. ఛేదనలో బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కానీ పరుగులు మాత్రం ఆగలేదు. 8వ స్థానంలో వచ్చిన బౌలర్‌ సైఫుద్దీన్‌ (51 నాటౌట్‌; 38 బంతుల్లో) పోరాటం గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత్‌ ఘనవిజయం లాంఛనమే అనుకున్నాక అతను షబ్బీర్‌ రెహ్మాన్‌ (36; 36 బంతుల్లో)తో కలిసి గొప్పగా పోరాడాడు. వీళ్లిద్దరూ ఏడో వికెట్‌కు 66 పరుగులు జోడించడం విశేషం. 245 పరుగుల వద్ద బుమ్రా షబ్బీర్‌ను బౌల్డ్‌ చేసి ఉపశమనాన్నిచ్చాడు. ఆ తర్వాత కూడా సైఫుద్దీన్‌ పోరాటం కొనసాగింది. మొర్తజా (8), రుబెల్‌ (9)ల అండతో జట్టును లక్ష్యానికి దగ్గర చేశాడు. 14 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన స్థితిలో బుమ్రా.. 48వ ఓవర్‌ చివరి రెండు బంతులకు కళ్లు చెదిరే యార్కర్లతో రుబెల్‌, ముస్తాఫిజుర్‌లను బౌల్డ్‌ చేసి బంగ్లా ఇన్నింగ్స్‌కు తెరదించాడు. అంతకుముందు పదో ఓవర్లో తమీమ్‌ (22) ఔటయ్యేసరికి స్కోరు 39 పరుగులే. అయితే షకిబ్‌.. సౌమ్య సర్కార్‌ (33), ముష్ఫికర్‌ (24), లిటన్‌ (22)ల అండతో బంగ్లాను పోటీలో నిలిపాడు. బ్యాటింగ్‌లో విఫలమైన పాండ్య.. బంతితో రాణించాడు. షకిబ్‌తో పాటు సర్కార్‌, లిటన్‌లను ఔట్‌ చేశాడు. 34వ ఓవర్లో షకిబ్‌ ఆరో వికెట్‌ రూపంలో ఔటయ్యే సమయానికి స్కోరు 179. ఇన్నింగ్స్‌ ముగియడం లాంఛనమే అనుకుంటే.. సైఫుద్దీన్‌, షబ్బీర్‌ పోరాడారు.

మొత్తమ్మీద టీమిండియా బతుకు జీవుడా అనుకుంటూ లీగ్ దశలో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సెమీస్ ఖాయం చేసుకోగలిగింది.  

Tags:    

Similar News