
SRH vs GT: సన్‌రైజర్స్ హైదరాబాద్... గతేడాది ఫైనల్స్ వరకు వెళ్లిన ఈ జట్టు ఈసారి ఐపిఎల్ 2025 లోనూ అలాంటి ఆరంభాన్నే అందుకుంది. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 287 పరుగుల భారీ లక్ష్యాన్ని విధించి సన్ రైజర్స్‌లో జోరు ఏమీ తగ్గలేదనిపించుకుంది. కానీ ఆ తరువాతే జట్టుకు అసలు సినిమా కనిపిస్తోంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడితే అందులో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. మొదటి మ్యాచ్‌లో 286 పరుగుల భారీ స్కోర్ కొట్టిన ఆ జట్టు ఆ తరువాత మూడు మ్యాచుల్లో 190, 163, 120... ఇలా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం ఐపిఎల్ 2025 పాయింట్స్ పట్టికలో అతి తక్కువ నెట్ రన్ రేట్‌తో అట్టడుగు స్థానంలో ఉంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చి పాయింట్స్ పట్టికలో ఏమైనా పైకి ఎగబాకాలంటే ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఒక విజయం అత్యవసరం.
ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ మేరకు పర్‌ఫామ్ చేస్తుందనేదే ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తోంది. ఓ వైపు సన్ రైజర్స్ హైదరాబాద్‌ను వరుస వైఫల్యాలు వెంటాడుతుంటే, మరోవైపు గుజరాత్ టైటాన్స్ మంచి ఫామ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడిన గుజరాత్ అందులో రెండింట విజయం సాధించి పాయింట్స్ పట్టికలో 3వ స్థానంలో ఉంది.
బ్యాట్స్‌మెన్ మెరుపులు ఏవి?
వరల్డ్ కప్ విన్నింగ్ కేప్టేన్ పాట్ కమ్మిన్స్ కేప్టేన్‌గా ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ముందుగా బ్యాట్స్‌మెన్ తమ పర్‌ఫార్మెన్స్ మెరుగు పర్చుకోవాల్సి ఉంది.
ఒక్క మొదటి మ్యాచ్‌లో బ్యాట్‌తో మెరుపులు మెరిపించిన ఇషాన్ కిషన్‌లో మళ్లీ ఆ జోరు కనిపించలేదు. ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్ కూడా ఇటీవల ఫెయిల్ అవడం ఆందోళన కలిగిస్తోంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ప్రత్యర్థుల బౌలింగ్ కంటే సన్ రైజర్స్ బ్యాట్స్‌మెన్ స్ట్రోక్‌ప్లేలోనే ఎక్కువ వైఫల్యం కనిపించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్లే ఆఫ్స్‌లో చోటు కూడా దక్కదు.
బౌలింగ్‌లోనూ సమస్యే...
యంగ్ లెగ్ స్పిన్నర్ జీషాన్ అన్సారీ మినహాయిస్తే... సీనియర్స్ ఎవ్వరూ కూడా వారి స్థాయికి తగినట్లుగా పూర్తి స్థాయిలో పర్‌ఫామ్ చేయడం లేదు. ప్యాట్ కమ్మిన్స్ (ఎకానమి రేట్ 12.30), ఆడం జంపా (ఎకానమి రేట్ 11.75), మొహమ్మద్ షమి (ఎకానమి రేట్ 10.00) ఇంకా బెటర్‌మెంట్ చూపించాల్సి ఉంది.
ఇంకా చాలా ఉందంటున్న కమిన్స్
ఓవైపు సన్ రైజర్స్ ఆటగాళ్ల పర్‌ఫార్మెన్స్‌పై అభిమానుల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుంటుంటే, మరోవైపు కేప్టేన్ ప్యాట్ కమ్మిన్స్ మాత్రం ఆటగాళ్ల తీరు పర్వాలేదంటున్నాడు. టోర్నమెంట్‌లో తామేంటో చూపించుకునేందుకు మున్ముందు ఇంకా చాలా అవకాశమే ఉందని కమ్మిన్స్ ధీమా వ్యక్తంచేస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాకు చెందిన ప్లాట్‌ఫామ్స్‌తో మాట్లాడుతూ కమ్మిన్స్ ఈ వ్యాఖ్యలు చేశాడు.