SRH vs RR match: రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
SRH vs RR match highlights: చివర్లో షిమ్రన్ హెట్మెర్, శుభం దూబే కూడా చెరో 4 సిక్సులు బాది రాజస్థాన్ రాయల్స్ జట్టును

SRH vs RR match: రాజస్థాన్ రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
SRH vs RR match highlights: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఐపిఎల్ 2025 సీజన్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీజన్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్ జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చెలరేగిపోయింది. స్టేడియం నలువైపులా బౌండరీల మీద బౌండరీలు బాదుతూ రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్ 47 బంతుల్లోనే 106 పరుగులతో సెంచరీ కొట్టాడు.
ఇషాన్ కిషన్ ఐపిఎల్ కెరీర్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ట్రావిస్ హెడ్ 31 బంతుల్లో 67 పరుగులు (3 సిక్స్‌లు, 9 ఫోర్లు) చేసి జట్టు స్కోర్ పెరగడంలో కీలక పాత్ర పోషించాడు. నితీష్ రెడ్డి (30 పరుగులు), హెన్రి క్లాసిన్ (34 పరుగులు), అభిషేక్ శర్మ (24 పరుగులు) చేసి స్కోర్‌ను పెంచడంలో తమ వంతు పాత్ర పోషించారు.అలా హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 286 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఐపిఎల్ చరిత్రలో ఇది రెండో హైయెస్ట్ స్కోర్ కావడం మరో విశేషం.
287 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ కు ఆరంభంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు చెక్ పెట్టారు. పవర్ ప్లేలోనే జట్టు మొత్తం స్కోర్ 77 పరుగుల వద్ద ఉండగానే 3 వికెట్లు పడగొట్టారు. సిమర్జీత్ సింగ్ బౌలింగ్ లో యశస్వి జైశాల్ (1), రియాన్ పరాగ్ (4) ఔట్ అయ్యారు. ఆ తరువాత కొద్దిసేపటికే మొహమ్మద్ షమీ బౌలింగ్‌లో నితీష్ రానా కూడా 11 పరుగులకే కమ్మిన్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు.
3 వికెట్లు పడిన తరువాత సంజూ శాంసన్ కొంత ఇన్నింగ్స్ రిపేర్ చేసే ప్రయత్నం చేశాడు. 37 బంతుల్లో 66 పరుగులు ( 7 ఫోర్లు, 4 సిక్సులు) చేసి జట్టు స్కోర్‌ను పరుగెత్తించే క్రమంలోనే హర్షల్ పటేల్ బౌలింగ్‌లో హెన్రిచ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా సంజు తరహాలోనే దూకుడు చూపించాడు. 35 బంతుల్లో 70 పరుగులు ( 5 ఫోర్లు, 6 సిక్సులు) చేసి రాజస్థాన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఆడం జంపా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగక తప్పలేదు.
చివర్లో షిమ్రన్ హెట్మెర్, శుభం దూబే కూడా చెరో 4 సిక్సులు బాది జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ... అప్పటికే ఓవర్లు దగ్గరపడటంతో వారి ప్రయత్నాలు కూడా ఫలించలేదు. ఆ ఇద్దరు చివర్లో ఆ పరుగులు చేసి ఉండకపోయుంటే రాజస్థాన్ రాయల్స్ మరింత ఘోర పరాజయం పాలయ్యేది. మొత్తానికి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 242 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ముగిసింది. ఫలితంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.