
GT vs PBKS : ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ (PBKS) ఘన విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన ఉత్కంఠ పోరులో 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓ సంఘటన చోటుచేసుకుంది. మార్కస్ స్టోయినిస్ కొట్టిన సిక్సర్ నేరుగా మహిళా సెక్యూరిటీ గార్డు కాలికి తగలడంతో ఆమె గాయపడింది.
వివరాల్లోకి వెళితే.. మార్కస్ స్టోయినిస్, 'ది హల్క్' అని కూడా పిలుస్తారు, ప్రపంచ క్రికెట్‌లోని అత్యంత ప్రమాదకరమైన హిట్టర్లలో ఒకడు. PBKS తరపున 15 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఆ సమయంలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో డీప్ మిడ్-వికెట్ మీదుగా ఓ భారీ పుల్ షాట్ కొట్టాడు. ఆ షాట్ అంత వేగంగా వెళ్ళింది అంటే, బంతి స్టేడియంలో మ్యాచ్ చూడకుండా వేరే పనిలో నిమగ్నమైన మహిళా సెక్యూరిటీ గార్డు కుడి కాలికి బలంగా తాకింది. దీంతో ఆమె గాయపడింది. వెంటనే ఆమెకు వైద్య సహాయం అందించారు. ఆ తర్వాత ఆమె కోలుకుంది, కానీ ఆమె కాలు వాచిపోయింది.
ఈ మ్యాచ్ లో PBKS కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 42 బంతుల్లో 97 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 5 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. ప్రియాన్ష్ ఆర్య (47), శశాంక్ సింగ్ (44)* కూడా రాణించారు. PBKS 20 ఓవర్లలో 243/5 భారీ స్కోరు సాధించింది. GT ఛేదనలో సాయి సుదర్శన్ (58), జోస్ బట్లర్ (53) అర్ధ సెంచరీలు చేశారు. శుభ్‌మన్ గిల్ (39), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ (35)* కూడా వేగంగా ఆడారు. GT 20 ఓవర్లలో 232/5 స్కోరు మాత్రమే చేయగలిగింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓడిపోయింది.
శ్రేయాస్ అయ్యర్ పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేశాడు. అతడు 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌ను గెలిచి టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించింది.