మళ్లీ రాజస్తాన్‌ గెలుపు

Update: 2019-04-20 14:40 GMT

ఐపీఎల్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌ను రాజస్తాన్‌ 19.1 ఓవర్లలో ఛేదించింది. ముందుగా బ్యాటింగ్‌ చేపట్టిన ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ను డీకాక్‌-రోహిత్‌ శర్మలు ఆరంభించారు. అయితే రోహిత్‌ శర్మ(5) నిరాశపరిచాడు. దాంతో ముంబై ఇండియన్స్‌ 11 పరుగులకే ఒక వికెట్‌ను కోల్పోయింది. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌.. డీకాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే డీకాక్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ముంబై స్కోరు 108 పరుగుల వద్ద సూర్యకుమార్‌ యాదవ్‌(34) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.

అటు తర్వాత డీకాక్‌-హార్దిక్‌ పాండ్యాల జోడి ఇన్నింగ్స్‌ మరమ్మత్తులు చేపట్టింది. డీకాక్‌(65;47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక‍్సర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్‌ బాటపట్టాడు. ఇక పొలార్డ్‌(10), హార్దిక్‌ పాండ్యా(23)లు స్కోరు పెంచే క్రమంలో ఔటయ్యారు. చివర్లో బెన్‌ కట్టింగ్‌ 9 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌ సాయంతో​ 13 పరుగులు చేయడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. అజింక్యా రహానే(12) విఫలమయ్యాడు, అయితే కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(59 నాటౌట్‌; 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌)) బాధ్యతాయుతంగా ఆడి జట్టు విజయానికి కృషి చేశాడు. రియాన్‌ పరాగ్‌(43; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్‌ విజయం నమోదు చేసింది. అలాగే సంజూ శాంసన్‌(35; 19 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు.

Similar News