RCB vs PBKS: పంజాబ్ కింగ్స్ పై రాయల్ ఛాలెంజర్స్ జయకేతనం
RCB vs PBKS: 177 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించిన బెంగళూరు
RCB vs PBKS: బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయభేరి మోగించింది. జట్టు విజయంలో అత్యధిక పరుగులతో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. టాస్ గెలిచిన బెంగళూరు జట్టు కెప్టన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 176 పరుగులు నమోదు చేసింది. పంజాబ్ కింగ్స్ తరఫున కెప్టన్ శిఖర్ ధావన్ 45 పరుగులతో టాప్ స్కోరర్ కాగా జితేశ్ శర్మ 27 పరుగులు, ప్రభ్ సిమ్రాన్ 25 పరుగులు, శాం కరణ్ 23 పరుగులు, శశాంక్ సింగ్ 21 పరుగులు, లివింగ్ స్టోన్ 17 పరుగులు అందించారు.
177 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దూకుడు ప్రదర్శించింది. ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ బౌండరీల మోతతో స్కోరుబోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశాడు. ప్రారంభంలోనే ఓపెనర్లలో కెప్టన్ డుప్లెసిస్ మూడు పరుగులకే పెవీలియన్ బాట పట్టాడు. ఆతర్వాత వచ్చిన కెమరన్ గ్రీన్ కూడా కాసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రజత్ పాటిదర్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్ది విజయతీరం చేరే ప్రయత్నంలో వికెట్ల పతనం ఆరంభమైంది. పాటిదర్ 18 పరుగులవద్ద వెనుదిరిగాడు. ఆతర్వాత వచ్చిన మ్యాక్స్ వెల్ క్లీన్ బౌల్డ్ అభిమానులను నిరాశపరచింది. అనుజ్ రావత్ 11 పరుగులతో పెవీలియన్ బాటపట్టాడు. విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 11 బౌండరీలు, రెండు సిక్సర్లతో 77 పరుగులవద్ద పెవీలియన్ బాట పట్టాడు.
దినేశ్ కార్తిక్, లెమ్రర్ ఇద్దరూ కలిసి బౌండరీ మోతతో ఆశలు రేకెత్తించారు. అద్భుతమైన షాట్లతో జట్టును విజయతీరం చేర్చారు. దినేశ్ కార్తిక్ 10 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 28 పరుగులు, మహిపాల్ లెమ్రర్ 8 బంతుల్లో రెండు ఫోర్లు, ఒకసిక్సర్ తో 17 పరుగులు నమోదు చేశారు.