ఇంగ్లాండ్ కు భంగ పాటు : పాక్ చేతిలో ఓటమి

Update: 2019-06-03 17:38 GMT

చప్పగా మొదలైన ప్రపంచ కప్ పోటీలకు పసందైన మ్యాచ్ ఎదురైంది. నువ్వా.. నేనా అన్నట్టు.. బంతి బంతికీ ఉద్వేగాన్ని పెంచుతూ.. వన్డే ఆట లోని అసలు సిసలు మాజాని చూపిస్తూ ఇంగ్లాండ్, పాకిస్థాన్ లు తలపడ్డాయి. విజయం ఇరుపక్షాలతోనూ దోబూచులాడుకుంది. ఒక జట్టు సమిష్టి కృషితో భారీ స్కోరు సాధిస్తే.. రెండో జట్టు ఇద్దరి మీద ఆధారపడి ముందుకు సాగింది. క్రికెట్ లో సమిష్టితత్వం ఎంత మేలు చేస్తుందో ఈ మ్యాచ్ నిరూపించింది. సమిష్టిగా చివరి వరకూ పోరాడిన పాకిస్థాన్ విజయం సాధించింది. వరల్డ్ కప్ పోటీలకు ముందు ఇంగ్లాండ్ గడ్డపైనే సిరీస్ కోల్పోయిన కసి.. అక్కడ ఇప్పటికే సంపాదించిన అనుభవాన్ని రంగరించి పాకిస్థాన్ ఆటగాళ్లు విజృంభించారు. అలాగని విజయం అంత సులువుగా వారికి దక్కలేదు. కానీ, ఈ విజయం రానున్న పోటీలకు పాకిస్థాన్ కు సంజీవనిలా పనిచేస్తుందనడం లో సందేహం లేదు. 

ఇంగ్లాండ్ జట్టులో ఇద్దరు సెంచరీలు సాధించారు. రూట్, బట్లర్ ఇద్దరూ పాకిస్థాన్ బౌలర్లకు ఒక విధంగా చుక్కలు చూపించారు. అయితే, సెంచరీ నమోదు చేసిన వెంటనే ఇద్దరూ పెవిలియన్ బాట పట్టారు. దాంతో ఇంగ్లాండ్ విజయానికి బ్రేకు పడిపోయింది. చివరికి పద్నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది ఇంగ్లాండ్. చివరి బంతి వరకూ ఆసక్తి కరంగా సాగిన మ్యాచ్ లో చివరికి పాకిస్థాన్ విజయకేతనం ఎగురవేసింది. వహాబ్ రియాజ్ మూడు వికెట్లు, షాబాద్ ఖాన్, మహ్మద్ అమీర్ చెరో రెండు వికెట్లు, మాలిక్, హఫీజ్ లు తలో వికెట్టూ తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. 

అంతకు ముందు భారీ లక్ష్యం ఖాయమనుకున్న ట్రెంట్‌ బ్రిడ్జ్‌ పిచ్‌పై పాక్‌ బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారించారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన పాక్‌ బ్యాట్స్‌మెన్‌ క్రమంగా జోరు పెంచారు. ఒకవైపు ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరినా.. రన్‌రేట్‌ తగ్గకుండా పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్‌ కొనసాగించారు. ఓపెనర్లు ఇమామ్‌ ఉల్‌ హక్‌ (44), ఫఖర్‌(36) మంచి ఆరంభాన్నిచ్చారు. ఆ తర్వాత బాబర్‌ అజామ్‌(63), హఫీజ్‌(84 ), కెప్టెన్‌ సర్పరాజ్‌(55) ఆడాల్సిన బంతుల్ని చీల్చి చెండాడారు. వదిలేయాల్సిన బంతులకు గౌరవం ఇచ్చి వదిలేశారు. దీంతో పాక్‌ నిర్ణీత 50ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 348పరుగులు చేసింది.

పాక్‌ ఇన్నింగ్‌లో భారీ షాట్లు కనిపించకపోయినా.. స్కోరుబోర్డు మాత్రం పరుగులు పెట్టింది.  చివర్లో  వరుసగా వికెట్లు కోల్పోయి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. మరోవైపు ఇంగ్లాండ్‌ బౌలర్లు అద్భుతంగా బంతులు విసిరినా.. ఇంగ్లాండ్‌ ఫీల్డింగ్‌ లోపాలు పాక్‌కు కలిసొచ్చాయి. ఇంగ్లాండ్‌ బౌలర్లలో వోక్స్‌, అలీ మూడు వికెట్లు పడగొట్టారు. 




Tags:    

Similar News