ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఆఖరు దశకు చేరుకుంది శుక్రవం జరిగిన మొదటి సెమీఫైనల్లో రాఫెల్ నాదల్ సునాయాస విజయం సాధించాడు. రెండో సెమీ ఫైనల్ వర్షం కారణంగా శనివారానికి వాయిదా పడింది. పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ 12వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–3, 6–4, 6–2తో మూడో సీడ్ రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)పై అలవోకగా గెలిచి ఈ టోర్నీలో 12వసారి ఫైనల్‌కు చేరాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫెడరర్‌తో ఇప్పటివరకు తలపడిన ఆరుసార్లూ నాదల్‌నే విజయం వరించడం విశేషం. 2 గంటల 25 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో నాదల్ ఆరుసార్లు ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు. ఫెడరర్ 34 అనవసర తప్పిదాలు చేయగా... నాదల్ కేవలం 19 మాత్రమే చేశాడు.