ప్రపంచ కప్ టోర్నీలో మరో మ్యాచ్ వర్షార్పణమైపోయింది. వెస్టిండీస్, దక్షిణాఫ్రికాల మధ్య ఈరోజు జరగాల్సిన మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఓటములతో కుంగి ఉన్న సౌతాఫ్రికాకు ఈ మ్యాచ్ కీలకమైనది.
మొదట మ్యాచ్ నిర్ణీత సమయానికి ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. షెల్డన్ కాట్రెల్ తన పదునైన పేస్‌తో హషీమ్ ఆమ్లా (6; 7 బంతుల్లో 1×4), అయిడెన్ మార్క్రమ్ (5; 10 బంతుల్లో 1×4)ను పెవిలియన్ చేర్చాడు. 11 వద్ద ఆమ్లా, 28 వద్ద మార్క్రమ్ ఔటయ్యారు. డికాక్ (17; 21 బంతుల్లో 1×4) నిలిచాడు. డుప్లెసిస్ (0; 7 బంతుల్లో) కొన్ని బంతులు ఆడాడు. ఎనిమిదో ఓవర్‌లో చినుకులు మొదలయ్యాయి. మూడు బంతులు పడ్డ తర్వాత అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత చిరుజల్లులు ఆగుతూ.. పడుతూ చివరి వరకు దోబూచులాడాయి. వాతావరణం సహకరించకపోవడంతో చివరికి రిఫరీ మ్యాచ్‌ను రద్దు చేశారు. దీంతో ఇరుజట్లకు తలా ఒక పాయింట్ వచ్చింది. సౌతాఫ్రికా సెమీస్ ఆశలు మరింత క్లిష్టమయ్యాయి.