Manu Bhaker: పడిలేచిన కెరటం.. రెండు పతకాలతో పారిస్ ఒలింపిక్స్‌ జర్నీ ముగించిన మనుభాకర్‌‌

మను భాకర్... పారిస్ ఒలింపిక్స్‌కు ముందు పోటీ ఇవ్వలేని క్రీడాకారిణిగానే ఈ పేరు పరిచయం.

Update: 2024-08-03 10:39 GMT

Manu Bhaker: పడిలేచిన కెరటం.. రెండు పతకాలతో పారిస్ ఒలింపిక్స్‌ జర్నీ ముగించిన మనుభాకర్‌‌

Manu Bhaker: పోయిన చోట దక్కించుకోవాలన్న కసి.. పతకం పట్టాలన్న పట్టుదల.. అంతంతే అనుకున్న చోట రెండు కాంస్యాలు సాధించి ఒలింపిక్‌ చరిత్రలో భారత షూటింగ్‌ దశను మార్చింది.. ఇలా పారిస్ ఒలింపిక్స్‌లో అంచనాలకు మించి సాగిన మను భాకర్‌ ప్రయాణం ముగిసింది. ఫైనల్‌ పోరులో ఊరించిన మూడో పతకం ఆఖరి నిమిషంలో చేజారింది.

మను భాకర్... పారిస్ ఒలింపిక్స్‌కు ముందు పోటీ ఇవ్వలేని క్రీడాకారిణిగానే ఈ పేరు పరిచయం. భారత్‌ తరపున టోక్యో ఒలింపిక్స్‌లో ఆడిన మను భాకర్.. ఆడిన ఏ ఈవెంట్‌లోనూ సత్తా చాటలేకపోయింది. నిరాశ మిగిలిస్తూ వెనుదిరిగింది. ఆ చేదు అనుభవం మనుభాకర్‌ను పారిస్‌పై గురిపెట్టేలా చేసింది. ఒలింపిక్స్‌లో పతకం కొట్టాలన్న ఆశయంతో బరిలోకి దించింది.

పీవీ సింధు, నిఖత్ జరీన్, దీపికా కుమారి.. ఇలా పారిస్ ఒలింపిక్స్‌కు ముందు అందరిచూపు వీరివైపే. అలా ఎలాంటి అంచనా లేకుండా పారిస్‌ ఒలింపిక్ గేమ్‌లో అడుగుపెట్టింది మనుభాకర్. తొలి ఆటతోనే అందరి చూపు తనవైపు తిప్పుకుంది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంతో ఆట మొదలుపెట్టిన మనుబాకర్.. ఆ ఈవెంట్‌లో ఫైనల్‌కు చేరి భారత అభిమానులకు పతకం ఆశలు రేపింది. ఫైనల్లో మూడో స్థానం సాధించి.. పారిస్ ఒలింపిక్స్‌ టేబుల్‌లో భారత్ పతకాల ఖాతాను తెరిచింది. ఆ తర్వాత జరిగిన మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ సరబ్‌జోత్‌ సింగ్‌‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది.

రెండు కాంస్య పతకాల అనంతరం మహిళల 25 మీటర్ల విభాగంలో ఫైనల్‌ చేరిన మనుబాకర్.. మరోసారి పోడియం ఎక్కడం ఖాయమని అందరూ అంచనా వేశారు. మనుభాకర్ నిలకడైన ప్రదర్శన ఆ అంచనాలను మరింత పెంచింది. భారత్ ఖాతాలో మరో పతకం ఖాయమని భారతావని ఎదురుచూసింది. అయితే హ్యాట్రిక్ ఆశలతో పారిస్ ఒలింపిక్స్‌ మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్‌ మ్యాచ్‌లో మనుభాకర్‌‌కు నిరాశ ఎదురైంది. తృటిలో మరో పతకం చేజారింది. ఫైనల్లో గట్టిపోటీ ఇచ్చిన మనుభాకర్.. 7వ సిరీస్ ముగిసేవరకు రెండోస్థానానికి చేరింది. అయితే అనూహ్యంగా రాణించిన హంగేరి షూటర్ మేజర్‌.. మనుభాకర్‌ను వెనక్కి నెట్టింది. దాంతో మనుభాకర్‌ నాలుగో స్థానంలో నిలిచింది.

మూడో పతకం సాధించాలన్న ఆశలు చెదిరిపోయినా.. కెరీర్‌ బెస్ట్ పర్ఫా్ర్మెన్స్‌తో చెరపలేని ముద్ర వేసింది మనుభాకర్. పీవీ సింధు, నిఖత్ జరీన్ లాంటి ప్లేయర్లు ఇంటిబాట పట్టిన చోట.. పతకాలతో ఉత్సాహం నింపింది. అంతేకాదు... భారత్ తరపున ఏ మహిళా షూటర్ సాధించని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్యాన్ని ముద్దాడి.. షూటింగ్ విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా మన భాకర్ చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత మిక్స్‌డ్ టీమ్‌లో సాధించిన కాంస్యంతో స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన భారత అథ్లెట్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 25 మీటర్ల విభాగంలో ఫైనల్‌ చేరి ఒకే ఒలింపిక్ సీజన్‌లో భారత్ తరపున మూడు ఫైనల్స్ ఆడిన తొలి మహిళా క్రీడాకారిణిగా నిలిచింది. 

Tags:    

Similar News