ముంబైపై గెలుపుతో రేసులో కోల్‌కతా

Update: 2019-04-29 03:08 GMT

వరుసగా ఆరు ఓటములతో ఢీలా పడ్డ కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చావోరేవో మ్యాచ్‌లో పరుగుల వరద పారించింది. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 233 పరుగుల టార్గెట్‌ను ముంబై ముందుంచింది. తొలుత బ్యాటింగ్‌ చేపట్టిన కేకేఆర్‌కు శుభారంభం లభించింది. శుభ్‌మన్‌ గిల్‌, క్రిస్‌ లిన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించారు. వీరిద్దరూ 9.3 ఓవర్లలో 96 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని అందించారు. శుభ్‌మన్‌ గిల్‌(76; 45బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), క్రిస్‌ లిన్‌(54; 29 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆండ్రీ రసెల్‌( 80 నాటౌట్‌; 40 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు)లు విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడంతో కేకేఆర్‌ 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై జట్టు 34 పరుగుల తేడాతో ఓటమి చెందింది.

రెండో ఓవర్లోనే డికాక్‌ (0) డకౌట్‌ కాగా, నాలుగో ఓవర్లో రోహిత్‌ శర్మ (12) పెవిలియన్ బాటపట్టారు. తర్వాత వచ్చిన లూయిస్‌ (15), సూర్యకుమార్‌ (14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాసేపు ఆడగలిగినా... రసెల్‌ వీళ్లిద్దరిని ఔట్‌ చేశాడు. క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌ (20; 2 ఫోర్లు) 21 బంతులాడినా మెరిపించలేకపోయాడు. హార్దిక్‌ పాండ్యా చెలరేగాడు. భారీ సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. కేవలం 17 బంతుల్లోనే 7 సిక్స్‌లు, ఒక బౌండరీ సాయంతో వేగంగా అర్ధసెంచరీ చేశాడు. 16వ ఓవర్‌ వేసేందుకు చావ్లా రాగా సిక్స్, 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టాడు. 17వ ఓవర్లో 4, 6తో 14 పరుగులు జతచేశాడు. అయితే ధాటిగా ఆడుతున్న హార్దిక్‌ను గర్నీ 18వ ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు. చావ్లా ఆఖరి ఓవర్లో కృనాల్‌ (24) ఔటయ్యాడు. దీంతో ముంబై జట్టు 198 పరుగులకే పరిమితమైంది. దీంతో కీలక మ్యాచ్ లో కోల్ కతా గెలుపొందింది.

Similar News