IPL 2024: అమ్మ ఆసుపత్రిలో... కేకేఆర్ మేసేజ్ తో తిరిగొచ్చిన గుర్బాజ్..
IPL 2024: ఐపీఎల్ 2024 లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)జట్టు ఫైనల్ కు చేరింది. జట్టు విజయంలో కేకేఆర్ జట్టు సభ్యుడు గుర్బాజ్ తన వంతు పాత్ర పోషించాడు.
IPL 2024: ఐపీఎల్ 2024 లో కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)జట్టు ఫైనల్ కు చేరింది. జట్టు విజయంలో కేకేఆర్ జట్టు సభ్యుడు గుర్బాజ్ తన వంతు పాత్ర పోషించాడు. తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశానికి వెళ్లిన రహ్మనుల్లా గుర్బాజ్ తిరిగొచ్చి జట్టుకు తన అవసరాన్ని చాటి చెప్పారు.
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టులో ఇంగ్లాండ్ కు చెందిన ఫిల్ సాల్ట్ కీలక ఆటగాడు. తమ క్రికెట్ జట్టు అవసరాల రీత్యా ఫిల్ సాల్ట్ ఫిల్ సాల్ట్ ఇంగ్లాండ్ వెళ్లాడు. అయితే మే మొదటి వారంలోనే ఆఫ్ఘనిస్తాన్ కు చెందిన 22 ఏళ్ల గుర్బాజ్ కూడా స్వదేశానికి వెళ్లాడు. తల్లి అనారోగ్యంగా ఉందని సమాచారం రావడంతో ఆయన ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడు.
ఫిల్ స్టాల్ మెరుపు బ్యాటింగ్ తో జట్టుకు మంచి ఆరంభాన్ని అందించాడు. స్టాల్ ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లడంతో ఆయన స్థానంలో గుర్బాజ్ ను దింపాలని కేకేఆర్ భావించింది. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న గుర్బాజ్ కు మేసేజ్ పంపింది జట్టు యాజమాన్యం. ఐపీఎల్ లో ఆడేందుకు గుర్బాజ్ ఇండియాకు తిరిగి వచ్చారు.
మే 21న సన్ రైజర్స్ హైద్రాబాద్ లో జరిగిన మ్యాచ్ లో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. కేకేఆర్ జట్టు 13.4 ఓవర్లలో సన్ రైజర్స్ అందించిన టార్గెట్ ను చేధించింది. ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన గుర్బాజ్ 14 బంతుల్లో 23 పరుగులు చేశారు. అంతేకాదు వికెట్ కీపర్ గా రెండు క్యాచ్ లు అందుకున్నారు. ఒక రనౌట్ చేశారు. సన్ రైజర్స్ హైద్రాబాద్ జట్టు ఓటమిలో రహ్మనుల్లా గుర్బాజ్ తనవంతు పాత్ర పోషించారు.
సన్ రైజర్స్ హైద్రాబాద్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత రహ్మనుల్లాఖాన్ మీడియాతో మాట్లాడారు. అమ్మ అనారోగ్యం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాను. సాల్ట్ జట్టుకు దూరం కావడంతో ఐపీఎల్ ఆడేందుకు తిరిగి వచ్చినట్టుగా చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అమ్మతో ఫోన్ లో మాట్లాడుతున్నట్టుగా గుర్బాజ్ చెప్పారు. తన కుటుంబంతో పాటు కేకేఆర్ ఫ్యామిలీ కూడా తనకు ముఖ్యమేనని ఆయన చెప్పారు.
సన్ రైజర్స్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత రహ్మనుల్లా గుర్బాజ్ గూగుల్ ట్రెండ్స్ లో టాప్ లో నిలిచాడు. గౌతమ్ గంభీర్ సార్, షారుఖ్ ఖాన్ సార్, హెడ్ కోచ్ అందరూ ఒక కుటుంబంలా ఉంటాం... ఫ్లే ఆఫ్స్ సమయాల్లో ఒత్తిడి ఉంటుంది. కానీ, మీరు గేమ్ ను ఆస్వాదించండనే ఒకే ఒక్క మాటతో తమపై ఉన్న ఒత్తిడిని మేనేజ్ మెంట్ తొలగించిందని ఆయన తెలిపారు.