ఐపీఎల్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కే నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముందుగా బ్యాటింగుకు దిగిన చెన్నై జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
చెన్నై ఆదిలోనే షేన్ వాట్సన్(7) వికెట్‌ను కోల్పోయింది. ఆ దశలో డుప్లెసిస్‌కు జత కలిసిన సురేశ్ రైనా స్కోరు బోర్డును కదిలించాడు. ఈ జోడి 120 పరుగులు భాగస్వామ్యాన్ని అందించింది. ఈ దశలో రైనా రెండో వికెట్‌గా ఔటయ్యాడు. 38 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేశాడు
మరొకవైపు డుప్లెసిస్ ఆది నుంచి కింగ్స్ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 55 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. అయితే సెంచరీకి చేరువగా వచ్చిన డుప్లెసిస్.. సామ్ కరాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత ధోని(10 నాటౌట్) దీంతో సీఎస్‌కే నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.
ఇక 171 పరుగులు విజయలక్ష్యంతో బరిలో దిగిన పంజాబ్ జట్టు ఆటగాళ్లలో కేఎల్ రాహుల్(71; 36 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించగా, క్రిస్ గేల్(28; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 108 పరుగులు భాగస్వామ్యాన్ని అందించారు. రాహుల్, గేల్ వరుస బంతుల్లో పెవిలియన్ బాటపట్టారు, నికోలస్ పూరన్(36; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్ చేయడంతో కింగ్స్ పంజాబ్ సునాయాసంగా గెలుపొందింది.