36 సంవత్సరాల తరువాత కపిల్ రికార్డు బద్దలైంది. అయితే, కపిల్ ప్రపంచ కప్ లో సాధించిన ఘనతను వన్డే సిరీస్ లో పాక్ క్రికెటర్ అధిగమించడం విశేషం.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అరుదైన ఘనత సాధించాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో బ్రిస్టల్ వేదికగా జరిగిన మూడో వన్డేలో 151 పరుగులు చేసిన అతను అతి చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 24 సంవత్సరాల వయస్సులో జింబాబ్వేతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో 175 పరుగులు చేశారు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఇమామ్ 23 సంవత్సరాలకే 150 పరుగులు చేసిన ఈ రికార్డును తిరగరాశాడు.
కాగా, ఇమామ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధన ప్రారంభించిన ఇంగ్లండ్‌కు జానీ బెయిర్‌స్టో.. అండగా నిలిచాడు. 93 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సులతో 128 పరుగులు చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు జేసన్ రాయ్(76), జో రూట్(43), మొయిన్ అలీ(46) కూడా అద్భుతంగా రాణించడంతో ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 359 పరుగులు చేసి ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.