టీమిండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా తన గణాంకాలతో ఆసీస్ జట్టును కలవరపెడు తున్నాడు. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లలో ఒకడిగా పేరున్న బుమ్రా ప్రస్తుతం సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఆసీస్ పర్యటనలో తన బౌలింగ్ విశ్వరూపం చూపించేందుకు సిద్ధమౌతున్నాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించనున్నాడు. పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్ధులకు అడ్డుకట్ట వేయనున్నాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. IPLలో 27 వికెట్లతో అద్భుతంగా రాణించాడు. టాప్‌ఆర్డర్, మిడిల్‌ఆర్డర్, లోయర్‌ఆర్డర్ బ్యాట్స్‌మెన్ బుమ్రా పేస్‌కు చేతులెత్తేశారు.
2016లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో టీమిండియాలోకి బుమ్రా అరంగేట్రం చేశాడు. 64వన్డేల్లో 104వికెట్లు తీశాడు. అతడి ఎకానమీ కేవలం 4.55 మాత్రమే. డెత్‌ఓవర్ల స్పెషలిస్టుగా ఎదిగిన బుమ్రా సులభంగా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయగలడు. క్రీజులో ఎటువంటి బ్యాట్స్‌మన్ ఉన్నాసరే బుమ్రా బౌలింగ్‌ను అంత ఈజీగా ఎదుర్కోలేరు. ఆచితూచి ఆడాల్సిందే. 64వన్డేలు, 50టీ20లు, 14టెస్టులు ఆడిన బుమ్రా పరిమిత ఓవర్ల క్రికెట్లో టాప్ బౌలర్‌గా రాణిస్తున్నాడు. ఈ నెల 27 నుంచి ప్రారంభమయ్యే ఆసీస్ పర్యటనలో భారత జట్టు 3వన్డేలు, 3టీ20లు, 4టెస్టులు ఆడనుంది.