SRH-Ishan Kishan: ముంబై నుంచి బయటకు రావడం వల్లే ఇషాన్ రాణించాడా?
SRH-Ishan Kishan: ఇవన్నీ చూసిన క్రికెట్ పండితులు ఇషాన్‌ను మరో లెవెల్ ప్లేయర్‌గా చెబుతున్నారు.

SRH-Ishan Kishan: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల బ్యాటింగ్ దంచికొట్టే శైలికి ముచ్చట పడని వాళ్లు ఉండరు. అభిమానులు మరిచిపోలేని డైలాగ్ ఒకటి గతేడాది నుంచే వినిపిస్తోంది. 'ఉప్పల్‌లో కొడితే బాల్ తుప్పల్‌లో పడాలి!'. ఇది కేవలం ఫన్ లైన్ కాదు, ఈ సీజన్ SRH ఆటగాళ్ల ఆటతీరు చూస్తే ఇది వాస్తవం అనిపిస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్‌ల ఊచకోతకు ప్రత్యర్థి బౌలర్లు బెంబేలెత్తిపోతుంటే.. ఇప్పుడు ఆ జాబితాలోకి ఇషాన్ కిషన్ కూడా చేరిపోయాడు.ఈ ఝార్ఖండ్ డైనమైట్ 47 బంతుల్లోనే సెంచరీ సాధించి SRH విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అటు ఇషాన్ కథ ఒక రియల్ కమ్‌బ్యాక్ స్టోరీ. గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో ఉండగా ఫామ్ కోల్పోయిన ఈ వికెట్ కీపర్-బ్యాటర్‌పై ఫ్యాన్స్ నమ్మకాన్ని కోల్పోయారు. మెగా ఆక్షన్‌కు ముందు అతడిని రిటైన్ చేయకుండా ముంబై ఇండియన్స్ వదిలేశాడు. ఇదే సమయంలో SRH 11 కోట్ల రూపాయలతో ఇషాన్ కొనుగోలు చేయడం చాలామందికి షాక్ ఇచ్చింది. ఫామ్‌లో లేని ఆటగాడిపై అంత డబ్బు ఎందుకన్న విమర్శలు ఎగిసిపడ్డాయి. కానీ ఇప్పుడు ఆ విమర్శలన్నీ మూతపడ్డాయి. ఇషాన్ కిషన్ బ్యాట్ మాట్లాడింది. గ్లోవ్స్ వేసుకున్న వికెట్ కీపర్‌గానే కాదు.. ఓపెనర్‌గా కూడా మెరుపులు మెరిపించగలడని నిరూపించాడు. అట్టడుగునుంచి లేచి ఈ స్థాయికి చేరడం చిన్న విషయం కాదు. ఒకానొక దశలో సెలెక్షన్ కోసం ఎదురు చూస్తూ గడిపిన ఇషాన్.. ఇప్పుడు SRH విజయంలో కేంద్ర బిందువుగా మారాడు. 47 బంతుల్లో శతకం సాధించడమంటే కేవలం ఓ ఆటగాడి ప్రతిభ మాత్రమే కాదు, అతని నమ్మకాన్ని, పునర్జన్మను కూడా ప్రతిబింబిస్తుంది.
బౌలర్లను బేబీ స్టెప్పులతో ఎదుర్కొని.. షార్ట్ పిచ్ బాల్స్‌ను బుల్లెట్‌లా బౌండరీకి తరలించడంలో అతని మ్యాచ్యూరిటీ కనిపించింది. స్పిన్‌కు ధాటిగా ఆడేందుకు అతను ఉపయోగించిన ఫుట్‌వర్క్ అద్భుతుమనే చెప్పాలి. ఇవన్నీ చూసిన క్రికెట్ పండితులు ఇషాన్‌ను మరో లెవెల్ ప్లేయర్‌గా చెబుతున్నారు. గతాన్ని పక్కనబెట్టి, ధైర్యంగా ముందుకు సాగిన ఇషాన్... ఇప్పుడు SRH జట్టు బలంగా నిలబడేందుకు ప్రధాన పునాదిగా నిలుస్తున్నాడు. అంతేకాకుండా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ వల్ల SRH టాప్ ఆర్డర్‌కు కొత్త జోరు వచ్చింది. అభిషేక్-హెడ్ ముందు బౌండరిల వర్షం కురిపిస్తే.. ఇషాన్ ఆ వానను తుపానుగా మార్చాడు. అతని ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లు లైన్-లెంగ్త్ ఎక్కడ వేయాలోనే అయోమయంలో పడిపోయారు. ఒకే సమయంలో పవర్, టెక్నిక్, టెంపరమెంట్..ఇలా మూడు కూడా అతని ఇన్నింగ్స్‌లో కనిపించడం విశేషం. ఇవి చూసిన క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఒకే మాట అంటున్నారు. ముంబై ఇండియన్స్‌లో ఇషాన్ లేకపోవడం అతనికి మేలు చేసిందని అభిప్రాయపడుతున్నారు.