అనుకున్నంతా అయింది. వరల్డ్ కప్ టోర్నీలో కెప్టౌన్ లో ఈరోజు జరగాల్సిన భారత్, న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా నిలిచింది. మ్యాచ్ కు వరుణుడు అతిథిగా రావచ్చని రెండు రోజులుగా వాతావరణ శాఖ చెప్పిన మాటలు వాస్తవం అయ్యాయి. కొద్దీ సేపటి ముందు వరకూ వర్షం కురుస్తూనే ఉంది. అక్కడ సోమవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మైదానం చిత్తడిగా మారింది. ప్రస్తుతానికి వర్షం అయితే ఆగింది కానీ, పిచ్ మాత్రం తడిగానే ఉంది. దీంతో టాస్ ఆలస్యంగా వేయనున్నారు. ఈ మెగాటోర్నీలో కివీస్, టీమిండియా - రెండు జట్లూ ఇంతవరకు ఓటమి పాలు కాలేదు. న్యూజిలాండ్ హ్యాట్రిక్ కొట్టి ఆరు పాయింట్లతో జోరు మీదుంది. ఇక టీమిండియా సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా లను వరుసగా ఓడించి 4 పాయింట్లతో ఉంది. ఇపుడు ఈ మ్యాచ్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది.
మరోవైపు టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌కి కూడా వర్షం అడ్డంకిగా మారింది. కాగా గురువారం మొత్తం నాటింగ్‌హామ్‌లో వర్షం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో 50 ఓవర్ల మ్యాచ్ మొత్తం జరిగే అవకాశం లేదు. ఒకవేళ నేటి మ్యాచ్ గనుక రద్దైతే చెరో పాయింట్ లభిస్తుంది.
అలా జరిగితే భారత్ కన్నా న్యూజిలాండ్‌కే అధిక ప్రయోజనం చేకూరుతుంది. న్యూజిలాండ్ మొత్తంగా ఏడు పాయింట్లు సాధిస్తే సెమీస్‌కు చేరుకునే అవకాశాలు మెరుగుపడతాయి. ఆ జట్టు మిగతా ఐదింటిలో మూడు గెలిచినా సెమీస్‌లో తొలి రెండు స్థానాల్లో ఏదో ఒకటి సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌తో జరగబోయే తదుపరి మ్యాచ్ భారత్‌కు కీలకం కానుంది.