IPL 2025: కాసేపట్లో ముగియనున్న ఐపీఎల్ రిటెన్షన్ గడువు.. ఇంతకీ ఏంటి రిటెన్షన్.?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025కి సంబంధించి అప్పుడే ప్రక్రియ మొదలైంది. రిటెన్షన్ జాబితాను సమర్పించాలని ఫ్రాంచైజీలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి గడువు విధించింది. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం 5 గంటలోపు జాబితాను ప్రకటించాలని ప్రాంఛైజీలకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసలు రిటెన్షన్ అంటే ఏంటి.? ఎలాంటి నిబంధనలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రాంచైజీలు 2025 ఐపీఎల్‌క కోసం తాము పెట్టుకునే ఆటగాళ్ల జాబితాను విడుదల చేయడమే ఈ రిటెన్షన్ ప్రక్రియ. ఇప్పటికే పది ఫ్రాంఛైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విధానంలో ఫ్రాంచైజీలు రెండు నిబంధనలతో ఆరుగురు ప్లేయర్స్‌ను తమవద్ద అట్టిపెట్టుకొనే అవకాశం ఫ్రాంచైజీలకు ఉంది. ప్రస్తుతం ఈ రిటెన్షన్ జాబితాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.
రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌పైనే అందరి దృష్టి ఉంది. ధోనీని తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. రోహిత్‌ను పక్కనపెడతారనే వాదనకు ముంబయి ఇండియన్స్ ఎండ్ కార్డ్ వేసింది. ఇక శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా వదిలేస్తుందని, ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకొని అతన్ని సారథిగా నియమిస్తుందని వార్తలు వస్తున్నాయి. కేఎల్ రాహుల్‌ను మెగా వేలంలో తీసుకోవాలనే ఉద్దేశంలో సొంత జట్టు ఆర్సీబీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రిటెన్షన్ ప్రక్రియకు సంబంధించిన ఈవెంట్‌ను స్టార్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ 18 ఛానళ్లతోపాటు జియో సినిమా యాప్‌లో చూడొచ్చు.
నిబంధనలు ఏంటంటే..
రిటైన్ చేసుకునే క్రమంలో ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్ఠంగా ఆరుగురు ఆటగాళ్లను ఎంచుకోవచ్చు. కనీసం ఒక్క అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌ను మాత్రం రిటైన్ చేసుకోవాలి. అదికూడా భారత్‌కు చెందిన ఆటగాడే అయి ఉండాలి. టీమ్ వద్ద మొత్తం రూ. 120 కోట్లు ఉండగా.. అట్టిపెట్టుకున్న అయిదుగురి కోసం రూ.75 కోట్లు ఖర్చుపెట్టాల్సి వుంటుంది. వీరిలో మొదటి ఆటగాడికి ఫ్రాంఛైజీ రూ.18 కోట్లు, రెండో ఆటగాడికి రూ.14 కోట్లు, మూడో ఆటగాడికి రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే నాలుగో ఆటగాడికి రూ. 18 కోట్లు, ఐయిదో ఆటగాడికి రూ. 14 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌కు రూ.4 కోట్లు చెల్లించాలి.