Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. 5వ టెస్ట్ తర్వాత ఆ ప్రకటన?
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా.? టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారా.? అంటే అవుననే సమాధానం వస్తోంది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకోనున్నారా.? టెస్ట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారా.? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత కొన్ని రోజులుగా టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరిగే ఐదో టెస్ట్ మ్యాచ్ తర్వాత రోహిత్ తన రిటైర్మెంట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో బీసీసీఐ పెద్దలు, సెలక్టర్లు రోహిత్‌తో మాట్లాడినట్లు తెలుస్తోంది. రిటైర్మెంట్‌కు సంబంధించి పునరాలోచించుకోవాలని కోరారని, అయితే రోహిత్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరితే ఆ మ్యాచ్ వరకు నిర్ణయాన్ని వాయిదా వేయించేందుకు సెలక్టర్లు రోహిత్‌ను ఒప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రోహిత్ శర్మ గతకొద్ది రోజులుగా టెస్టు మ్యాచుల్లో ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో కివీస్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో నిరాశపర్చిన రోహిత్.. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలోనూ ఆశించిన స్థాయిలో ఆటతరును కనబరచడం లేదు. దీంతో రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.
కాగా టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరడం అంత సులభమైన విషయం కాదని నిపుణులు చెబుతున్నారు. మెల్‌బోర్న్ టెస్టులో ఓటమి డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలను మరింత కష్టంగా మార్చింది. ప్రస్తుతం టీమిండియా ఫైనల్ రేసులో ఉండాలంటే ఆసీస్‌తో సిడ్నీలో జరిగే చివరి టెస్టులో తప్పక గెలవాలి. ఓడినా లేదా డ్రా చేసుకున్నా భారత్ రేసు నుంచి తప్పుకున్నట్లే. దీంతో ఈ మ్యాచ్ డూ ఆర్ డై గా మారింది.