IPL 2023 Final: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ.. ఇవాళ కూడా వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్‌

IPL 2023: వర్షం ముప్పుతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన

Update: 2023-05-29 11:13 GMT

IPL 2023 Final: ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌పై ఉత్కంఠ.. ఇవాళ కూడా వర్షం అడ్డంకిగా మారే ఛాన్స్‌

IPL 2023: రెండు హేమాహేమీ జట్లు.. టైటిల్‌ ఎవరిదో తేల్చే కీలక మ్యాచ్‌.. టైటిల్ ఎవరికంటూ అభిమానుల అంచనాలు.. జోరుగా బెట్టింగులు సాగుతున్న ఉత్కంఠ వాతావరణంలో వరుణుడి ఎంట్రీ ఆ ఉత్కంఠను మరింత పీక్స్‌కు పెంచింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఫైనల్ మ్యాచ్ రిజర్వ్‌ డేకు వాయిదా పడింది. అయితే ఇవాళైనా మ్యాచ్ జరుగుతుందా అనేది ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొన్న టెన్షన్. ఇవాళ కూడా అ‌హ్మదాబాద్‌‌లో వర్షం పడనుందన్న వార్తలతో క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌, గుజరాత్ టైటాన్స్‌ మధ్య ఐపీఎల్ టైటిల్‌ పోరు ఆదివారం జరగాల్సి ఉంది. అయితే, వర్షం వల్ల ఇవాల్టికి మ్యాచ్‌ వాయిదా పడింది. గుజరాత్ వరుసగా రెండోసారి టైటిల్‌ టార్గెట్‌గా బరిలోకి దిగుతుండగా.. ముంబయితో సమంగా ఐదు టైటిళ్లను గెలవాలని ధోనీ సేన ఉవ్విళ్లూరుతోంది. అయితే రిజర్వ్‌ డే రోజున జరిగే మ్యాచ్‌లో ధోనీకి ఎలాంటి ఫలితం వస్తుందోనని సీఎస్‌కే అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వర్షం కారణంగా వాయిదా పడిన మ్యాచ్‌కు నేడు కూడా వాన గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఇవాళ కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే మాత్రం CSKకు నిరాశే మిగులుతుంది. వర్షం వల్ల ఆలస్యమైతే 20 ఓవర్ల నుంచి 15 ఓవర్లు, 10 ఓవర్లు, 5 ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. అది కూడా కుదరకపోతే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ వేసే అవకాశం కూడా లేకపోతే లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన జట్టును విజేతగా ప్రకటిస్తారు. దీంతో వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దు అయితే గుజరాత్ టైటాన్స్‌ టైటిల్ నెగ్గడం ఖాయం. లీగ్ స్టేజ్‌లో గుజరాత్ 10 విజయాలతో 20 పాయింట్లు సాధించింది. చెన్నై ఖాతాలో 17 పాయింట్లు మాత్రమే ఉన్నాయి.

 2019 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌ గుర్తుకురావడం సహజం. అప్పుడు కూడా వర్షం కారణంగా మ్యాచ్‌ రిజర్వ్‌డేకు వెళ్లింది. న్యూజిలాండ్‌పై ధోనీ (50) హాఫ్‌ సెంచరీ సాధించినా టీమ్‌ఇండియా మాత్రం ఓడిపోయింది. కీలక సమయంలో ధోనీ రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. విజయానికి చేరువగా వచ్చి మరీ భారత్ ఓటమిపాలైంది. ధోనీకి అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం గమనార్హం. మరుసటి ఏడాది ఇంటర్నేషనల్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలికేశాడు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే నెలకొంది. ఆటగాడిగా ధోనీకి ఇదే చివరి ఐపీఎల్‌ సీజన్‌గా భావిస్తున్న తరుణంలో రిజర్వ్‌ డే మ్యాచ్‌లో విజయం సాధించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఇలా జరగాలంటే మ్యాచ్‌ రద్దు కాకుండా కొన్ని ఓవర్లతోనైనా జరగాలి. ఈ క్రమంలో గత చరిత్రను ధోనీ తిరగరాసి ఐదో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంటాడో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News