ఢిల్లీ క్యాపిటల్స్ అదరగొట్టింది. సొంతగడ్డపై విజయాలు వెక్కిరిస్తున్న వేళ.. సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి ఢిల్లీ బదులు తీర్చుకుంది. సొంత ప్రేక్షకుల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 7 వికెట్లకు 163 పరుగులు చేసింది. క్రిస్ గేల్ 37 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో మెరిశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 166 పరుగులు చేసి గెలిచింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ను స్వల్పస్కోరుకే పరిమితం చేసిన ఢిల్లీ..బ్యాటింగ్‌లోనూ ఇరుగదీసింది. ధవన్, అయ్యర్ అర్ధసెంచరీలతో చెలరేగి జట్టు విజయంలో కీలకమయ్యారు.