World Boxing Champion Ship: ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్ మేరీకోమ్ సంచలనం!
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఎనిమిదో పతకాన్ని ఖాయం చేసుకుని భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఆమె 51 కేజీల విభాగంలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమెకు కచ్చితంగా కాంస్య పతకం లభిస్తుంది. ఒకవేళ ఇక్కడ ఆమె ఇదే ఆటతీరుతో గెలిస్తే స్వర్ణపతకం వైపు అడుగేస్తుంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన మేరీకోమ్ 51 కేజీల కేటగిరీలో 5–0తో కొలంబియాకు చెందిన వాలెన్సియా విక్టోరియాను చిత్తుగా ఓడించింది. మేరీ అనుభవం ముందు విక్టోరియా పంచ్‌లు పనిచేయకుండా పోయాయి. బౌట్ ఆరంభం నుంచే తన పిడిగుద్దులతో విక్టోరియాను ఉక్కిరిబిక్కిరి చేసిన ఈ మణిపూర్ వెటరన్ బాక్సర్ మేరీకోమ్ తక్కువ సమయంలోనే ప్రత్యర్థిని చిత్తూ చేసింది.
ఇప్పటివరకూ ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో ఏడు ప్రపంచ పతకాలతో క్యూబా పురుషుల బాక్సర్ ఫెలిక్స్ సవన్ నెలకొల్పిన రికార్డును ఈ విజయంతో మేరీ తుదిచిపెట్టేసింది. మేరీకోమ్ వరల్డ్ బాక్సింగ్‌లో ఇప్పటికే 6 స్వర్ణాలతో పాటు ఒక రజతం సాధించింది. క్వార్టర్ ఫైనల్లో తలపడిన ఐదుగురు బాక్సర్లలో నలుగురు సెమీస్ చేరడంతో భారత్‌కు నాలుగు పతకాలు ఖాయమయ్యాయి. మంజు రాణి (48 కేజీలు), జమున బొరొ (54 కేజీలు), లవ్లినా బొర్గొహైన్ (69 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ప్రపంచ వేదికపై రెండు సార్లు కాంస్యాలు గెలిచిన కవిత చహల్ (ప్లస్ 81 కేజీలు)కు మాత్రం నిరాశ ఎదురైంది.