వారు పుట్టింది ఒక దేశం. మ్యాచ్ ఆడేది మరో దేశం కోసం. వలస వచ్చిన క్రికెటర్లు అయితేనేం ఆడిన దేశానికి ప్రపంచ కప్ తెచ్చేరు. ఇంగ్లాండ్ చిర కాల స్వప్నాన్ని నిజం చేశారు. ఇంతకీ ఎవరా వలస ప్లేయర్స్..? ఇంగ్లాండ్ వరల్డ్ కప్ గెలవడంలో వారి పాత్ర ఎలాంటిది.? తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడిన ఇంగ్లాండ్ జట్టులో కీలకంగా వ్యవహరించింది వలస ప్లేయర్లే. వారు వేరే దేశంలో పుట్టినా ఇంగ్లాండ్ వలస వచ్చి ఆ టీంలో ఆడి గెలిపించారు.
ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన బెన్ స్టోక్స్‌ది నిజానికి ఇంగ్లాండ్ కాదు. స్టోక్స్ పుట్టింది న్యూజిలాండ్. అక్కడ పుట్టి ఆ తర్వాత ఇంగ్లాండ్‌కు వలస వచ్చి స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగిన స్టోక్స్.. ఇప్పుడు తన మాతృ దేశానికే ప్రపంచకప్ రాకుండా అడ్డుపడ్డాడు. బెన్ స్టోక్స్ స్వస్థలం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్. చిన్నప్పుడే అతడి కుటుంబం ఇంగ్లాండ్‌కు వలస వచ్చింది. మొదట్నుంచి ఇంగ్లాండ్‌కే ఆడుతున్న స్టోక్స్.. 2011లో తొలి వన్డే ఆడాడు. ముఖ్యంగా ఫైనల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టోక్స్ ప్రదర్శించిన తెగువ.. ఆఖరి ఓవర్లలో టెయిలెండర్లను అండగా పెట్టుకుని అతను పోరాడిన తీరు అద్భుతం. సూపర్ ఓవర్లోనూ అతను పోరాటాన్ని వీడకపోవడం వల్లే ఇంగ్లాండ్ అనూహ్య విజయాన్ని అందుకోగలిగింది.
సూపర్ ఓవర్ వేసిన జోఫ్రా ఆర్చర్ కూడా వలస క్రికెటరే. ఆర్చర్‌ది కరీబియన్ దీవుల్లోని బార్బడోస్. అండర్-19 స్థాయి వరకు వెస్టిండీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇంగ్లాండ్‌కు వలస వచ్చిన ఆర్చర్‌ను అదృష్టం వరించింది. గాయపడిన పేసర్ డేవిడ్ విల్లీ స్థానంలో ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కింది. 11 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు తీసిన ఆర్చర్ బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ది కూడా ఆ దేశం కాదు. ఐర్లాండ్ నుంచి మోర్గాన్ వలస వచ్చాడు. 2015 ప్రపంచకప్‌కు రెండు నెలల ముందు ఇంగ్లాండ్ వన్డే జట్టు పగ్గాలు చేపట్టిన మోర్గాన్.. 23 వన్డేల్లో ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు కూడా. మెరుగైన కెరీర్ కోసం ఇంగ్లాండ్‌కు తరలివచ్చిన మోర్గాన్.. ఇప్పుడు ఆ దేశం కలను నెరవేర్చాడు. హేమాహేమీ క్రికెటర్లు అందించలేని ప్రపంచకప్‌ను ఇంగ్లాండ్‌కు కానుకగా ఇచ్చాడు మోర్గాన్.
ఇంగ్లాండ్ విజయాల్లో ముఖ్యభూమిక పోషించిన జేసన్ రాయ్‌ది దక్షిణాఫ్రికా. పదేళ్ల వయసులో ఇంగ్లాండ్‌కు వచ్చాడు. 2015లో ఇంగ్లాండ్ వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ సూపర్ బ్యాట్స్ మెన్ ఇతడే. 8 మ్యాచ్‌ల్లో 443 పరుగులు సాధించాడు. ఒక సెంచరీ.. 4 హాఫ్ సెంచరీలు రాబట్టాడు. ఇక స్పిన్నర్లు మొయీన్ అలీ, ఆదిల్ రషీద్‌లు ఇంగ్లాండ్‌లోనే పుట్టినా వారి కుటుంబాలు పాకిస్థాన్ నుంచి వలస వచ్చాయి. ఇలా మొదటిసారి వరల్డ్ కప్ సాధించిన ఇంగ్లాండ్ టీంలో చాలా మంది వలస దేశస్తులే. వేరే దేశం నుంచి వచ్చిన వారితో ప్రపంచ కప్ సాధించింది ఇంగ్లాండ్.