Ind Vs Pak : వన్డే వరల్డ్‌కప్‌లో నేడు అసలు సిసలైన వార్‌.. భారత్‌- పాక్‌ మధ్య హైఓల్టేజ్‌ మ్యాచ్‌

Ind Vs Pak : పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు.. ప్రపంచకప్‌లో భారత్‌దే ఆధిపత్యం

Update: 2023-10-14 03:28 GMT

Ind Vs Pak : వన్డే వరల్డ్‌కప్‌లో నేడు అసలు సిసలైన వార్‌.. భారత్‌- పాక్‌ మధ్య హైఓల్టేజ్‌ మ్యాచ్‌

Ind Vs Pak : వన్డే వరల్డ్‌కప్‌లో అసలుసిసలైన సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైం రానే వచ్చింది. శనివారం భారత్‌- పాక్‌ మధ్య హైఓల్టేజ్‌ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్ వేదికగా దయాదుల మధ్య హోరా హోరీ ఫైట్ జరగబోతోంది. గెలుపు నీదా నాదా అనేంతగా యుద్ధ భూమిలోకి దిగబోతున్నారు ఆటగాళ్లు.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్ అంటే ఆ మజాయే వేరు. పాక్ బౌలర్లను భారత బ్యాట్స్ మెన్స్ చీల్చి చెండాడుతుంటే చూడాలని ప్రతి ఒక్క భారత క్రికెట్ ప్రేమికుడు కోరుకుంటారు. పాక్ పై గెలిచిన విజయ గర్వాన్ని చూడాలని ఆశ పడుతుంటారు. వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడి గెలిచిన టీమిండియా. మూడో మ్యాచ్‌ను పాక్‌తో ఆడబోతోంది. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా హైటెన్షన్ నెలకొంటుంది. ప్రతీ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠకు గురి చేస్తుంది. అది కూడా ‎భారత సొంత గడ్డపై ఇరు జట్లు ఢీకొనబోతుండడంతో వెయ్యికళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు.

వన్డే ప్రపంచకప్‌లో ఎప్పుడు మ్యాచ్ జరిగినా భారత్‌దే ఆధిపత్యం. ఇప్పటి వరకు రెండు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరిగితే అన్నింట్లో టీమ్‌ఇండియాదే విజయం. ప్రస్తుతం భారత్, పాక్ రెండు జట్లూ పటిష‌్టంగానే ఉన్నాయి. ఇప్పటి వరకు పాక్ రెండు మ్యాచ్‌లు అడితే రెండు గెలిచింది. టీమిండియా కూడా రెండు మ్యాచ్‌లు అడితే రెండు మ్యాచ్‌లు గెలిచింది. దీంతో హాట్ ఫేవరేట్ గా భారత్, పాక్ రంగంలోకి దిగుతున్నాయి. భారత్ బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ బలంగా ఉంది. రోహిత్, కోహ్లీ, రాహుల్ సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇక జడేజా, కుల్దీద్ రూపంలో స్పిన్నర్లు తిప్పేస్తున్నారు. అటూ పాక్ కూడా ఆల్ రౌండ్ ప్రదర్శనతో సమ ఉజ్జీగా ఉంది.

అహ్మదాబాద్‌లో భారత్‌- పాకిస్థాన్‌ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. మ్యాచ్‌ను కళ్లారా చూడాలని దేశ నలుమూలల నుంచి అభిమానులు అహ్మదాబాద్‌కు క్యూ కడుతున్నారు. దీంతో అక్కడి హోటల్ రూమ్స్, లాడ్జీలు నిండిపోయాయి. రూమ్‌లు ఖాళీ లేక ఆరోగ్య పరీక్షల పేరుతో ఆసుపత్రుల్లో బెడ్‌లు బుక్ చేసుకుంటున్నారు అభిమానులు. మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ మిస్ కాకూడదన్న లక్ష్యంతో స్థానిక ఆసుపత్రుల్లో ఆరోగ్య పరీక్షల ప్యాకేజీలు తీసుకుని బెడ్‌లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఆసుపత్రులన్నీ ఇప్పుడు రోగులకు బదులుగా క్రికెట్ ఫీవర్‌తో బాధపడుతున్న వారితో నిండిపోయాయి. దీని వల్ల అటు వైద్య పరీక్షలు పూర్తవడంతో పాటు మ్యాచ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. అయితే రోగులకు తప్ప అభిమానులకు ఇవ్వడానికి కొన్ని ఆసుపత్రులు విముఖత చూపిస్తున్నాయి.

డెంగీ నుంచి కోలుకుంటున్న ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ మళ్లీ బ్యాటు పట్టాడు. గురువారం ఉదయం 11 గంటలకు నరేంద్ర మోదీ స్టేడియానికి వచ్చిన గిల్‌ గంటసేపు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. పాక్‌ ఎడమచేతి వాటం షహీన్‌ అఫ్రిదిని దృష్టిలో పెట్టుకుని నెట్‌ బౌలర్‌ నువాన్‌ సెనెవిరత్నె (శ్రీలంక) గంటకు 150 కిమీ వేగంతో విసిరిన త్రోలను ఎదుర్కొన్నాడు. శుక్రవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, మైద్య బృందం గిల్‌ సాధనను సునిశితంగా పరిశీలించిన తర్వాతే అతనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

Tags:    

Similar News